రచనా కాలం : జూన్ 1999
నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (
1,
2)
__________________________
కృష్ణశాస్త్రి
అమృతవీణ (గేయసం హిత - 1)
గేయం - 141
__________________________
శీతవేళ రానీయకు - రానీయకు
శిశిరానికి చోటీయకు - చోటీయకు
ఎద లోపలి పూలకారు
ఏ నాటికీ పోనీయకు
శీత.....
ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా
అదరి పోవకు - ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా
లెక్క చేయకు - లెక్క చేయకు
శీత.....
చైత్రంలో తొగ రెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కై పెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో - మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను - నీలోకం నిలుపుకో
శీత......
ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపు టడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించు - వీలు కా దనీ పంపించు
శీత....
______________________
(ఇక్కణ్ణించి నా గోల)
ఆ గీతం చదవని వాళ్ళు వుంటారేమోగానీ, వినని వాళ్ళు ఉంటారని నేనను కోను. ఈ గీతాన్ని అద్భుతమైన సినిమా పాటగా మలచి ' మేఘసందేశం ' సినిమాలో వాడారు. రమేష్ నాయుడు సంగీత దర్శకుడు. జేసుదాసు, సుశీలలు ఈ పాటకి పూర్తిగా న్యాయం చేశారు. కవితలో వున్న ఆవేశాన్ని పూర్తిగా వినిపించ గలిగిన ఈ ముగ్గురూ అభినందనీయులు. కృష్ణ శాస్త్రివే "ఆకులో ఆకునై", "ముందుతెలిసెనా ప్రభూ" అనే గీతాల్ని కూడా ఈ సినిమాలో వాడుకున్నారు.... చాలా చక్కగా!
ఇది సినిమా పాట అవటం మూలంగానే నేనిన్ని సార్లు వినగల్గాననేది, అందుమూలంగానే ఇది నన్నింతగా ఆకట్టుగో గలిగిందనేవి నిజాలు.
ఏవిటీ ఈ పాటలో వున్నదంటారా..... అబ్బో చాలా వుంది! ఈ పాట నేను చాలా కాలం నుండీ వింటున్నాను. జాగ్రత్తగా వినండి, నో, చదవటం సరిపోదు, అర్జంటుగా కాసెట్ కొని వినండి. ఇందులో 1000 విటమిన్ లున్నాయి, వయసుని పెరక్కుండా నియంత్రించే మంత్రం వుంది... నిజంగా!!
నిస్సత్తువలో, నీరసంలో, అలసి, వోడిపోతున్న క్షణాన ఈ పాట పెట్టుకుని కళ్ళుమూసుకుని, గట్టిగా గొంతు కలిపి పాడండి.......
" ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదరి పోవకు
ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా లెక్క చేయకు
లెక్క చేయకు
శీత..... "
ఈ చరణం పూర్తయ్యేసరికి కొత్త వుత్సాహం, కొత్త ధైర్యం వస్తాయి. నో! ఈ పాట మీకు నిజాన్ని మరిపించి, పరిస్థితుల్నించి దూరంగా పారిపొమ్మని చెప్పదు. అలా వో కొత్త భావ ప్రపంచాన్ని తయరుచేసి మిమ్మల్ని ఆ మత్తులో ముంచెత్తదు. అలాంటి పనికిరాని ' రొమాంటిక్ ' కవిత్వం కాదిది. నిజానికి ఇది మీకు 'ఓటమికి ' తావులేదని చెపుతుంది. ఓటమిని అంగీకరించద్దని చెపుతుంది. కొత్త ఉత్సాహంతో మళ్ళీ నడుంకట్టమని చెపుతుంది. ' పెను నిద్దర వదిలి ' ' మును ముందుకు ' పొమ్మంటుంది. లెక్కచేయకు అంటుంది కానీ, పారిపోమని చెప్పదు!
కట్టలు తెంచుకున్న ఆనందోత్సాహంలో ఉన్నప్పుడు. చుట్టూతా వున్న వాళ్ళందరూ ఆకాశానికెత్తేసి, ఇంద్రుడివీ, చంద్రుడివీ అని పొగిడేస్తున్నప్పుడు, క్షణాలు, నిమిషాలు, గటలు, రోజులు వడివడిగా హాయిగా సాగిపోతున్నప్పుడు..... అప్పుడు.... కొంచెం సందు చూసుకుని వంటరిగా కూర్చుని ఈ పాట వినండి.........
" చైత్రంలో తొగ రెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కై పెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో - మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను - నీలోకం నిలుపుకో
శీత...... "
అంతే... ఈ చరణం పూర్తయ్యేటప్పటికి వళ్ళు జలదరిస్తుంది. నో! ఈ ఆనందం, ఈ సౌఖ్యం, ఇవన్నీ మాయలనీ, మిథ్యలనీ, అశాశ్వతాలనీ, నిష్ప్రయోజనాలనీ మెట్టవేదాంతం చెప్పి, మిమ్మల్ని నిర్వీర్యం చెయ్యదీ పాట! అందుకు విరుద్ధంగా.... మీ కళ్ళద్దాలు మీకు తెలియకుండానే మరింత దూరం చూడ్డం మొదలు పెడతాయి. అయ్యో మరికెంత మిగిలిపోయిందా నేచూడాల్సిందీ అనే తపన మొదలవుతుంది. మీ లక్ష్యాలూ, ఆశలూ, ఆదర్శాలూ, ఆవేశాలూ.... అన్నీ కొత్త శక్తులు నింపుకుంటాయి. నూతనోత్సాహం, కొత్త ప్రయాణం, కొత్త పరీక్షలు, కొత్త వెలుగులు, కొత్త గెలుపులు, కొత్త వోటములు.......
ఇలా సాగీ సాగీ....... ఓనాడు మీకు (మీకు... మీకే), అబ్బో చాలా దూరం వచ్చేశామే అనే అనుమానం వస్తుంది. చుట్టూతా వున్న వాళ్ళంతా కూడా (మీతో పాటు బయల్దేరిన వాళ్ళే) చతికిల పడి కూర్చుని, " ఒరే వెంకట్రావూ! ఇంకా ఎందుకురా ఈ తపన, ఇంకేం చెయ్యగలవు చెప్పు? హాయిగా కాళ్ళు జాపుకుని యములోడొచ్చేదాకా కూర్చోలేవు " అని చెపుతారు. ఈ మాట, మీరు చదివే పుస్తకాలని పట్టీ, తిరుగుతున్న మనుషుల్ని బట్టీ, చూస్తున్న ప్రదేశాలని బట్టీ మీకు 100వ ఏట గానీ, 80వ ఏట గానీ, 40వ ఏట గానీ, 20వ ఏట గానీ, 10 వ ఏట గానీ చివరికి... 5వ ఏట కూడా వినబడగలదు!! ఈ వృద్ధాప్యం, దాందుంప తెగ, ఏవయసులో నయినా రాగలిగిన జబ్బు, జాడ్యం. కానీ ఆ మాట వినపడ్డ వెంటనే వాళ్ళతో పాటు చతికిలబడకండి..... ఒక్కసారి ఈ పాట వినండి.....
" ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపు టడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించు - వీలు కా దనీ పంపించు
శీత.... "
ఈ చరణం పూర్తయ్యే సరికల్లా మీరు...... గాలిపటానికి సూత్రం కట్టి, ఎగరేయటానికి గోదారొడ్డుకి వెళ్ళ్తూ వుంటారు. జాగ్రత్త, పరిగెట్టకండి, పై జేబులో గోలీలు కింద పడిపోగలవు!! ఇదీ ఈ పాటలో ఉన్నది..... శక్తి, energy, power!
P.S. " ఎంత వయసొచ్చినా ఈ కోతి వేషాలు మానవేమిరా " అనే మా అమ్మకి మాత్రం చెప్పకండేం ఈ పాట గురించి!
- అక్కిరాజు భట్టిప్రోలు