రచనా కాలం : మార్చి 1999
మబ్బులంటే మాకు భయం!
ఒకప్పుడు రెండు పక్కల్నించీ వస్తుండేవి.
చిక్కగా నల్లగా, భయంకరంగా ఉరుముతూ!
ఏ మబ్బులకింద ఉన్నా మనిలేకుండా అందరం భయపడే వాళ్ళం.
" అదుగో, ఆ మబ్బులు ఢీకొంటే, అమ్మో ఇంకేముందీ? అంతా ప్రళయమే, అందరూ ఊడ్చిపెట్టుకు పోతారూ " అని భయ పెట్టేవాళ్ళు. అందరం అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ చూస్తుండే వాళ్ళం.
అవి పోటా పోటీగా ఉరుముతూ వుండేవి, భయపెడుతూ వుండేవి. అవి చెరో ప్రక్కనించీ ఊరంతటినీ ఎంత దొరికితే అంతమేరకు కమ్మేశాయి. వాటికి పోటీ, "నువ్వెంత నాశనం చెయ్యగలవో నేనంతకన్నా ఎక్కువే చెయ్యగలను " అంటున్నట్టుగా వుండెవి. వూరంతా సగానికి విడిపోయింది. సగం ఆ మబ్బులకింద, సగం ఈ మబ్బులకింద!
మాకంతా అయోమయంగా వుండేది.
కొందరు పెద్దలు పటమటి దిక్కుగా వెళ్ళారు. కొందరు అందుకు విరుధ్ధంగా తూర్పుకు వెళ్ళారు. మరికొందరు ఒక అడుగు అటుకి ఒక అడుగు ఇటుకి వేస్తూ ఎటూ వెళ్ళకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే వున్నారు. కానీ అందరికీ గుబులుగానే వుండేది. అడుగడుక్కీ తలెత్తి పైకి చూస్తూనే వుండే వాళ్ళం. ప్రతి రోజూ దుర్వార్తలకోసమే ఎదురుచూస్తూ వుండే వాళ్ళం. కానీ ఏవో అక్కడా ఇక్కడా చెదురు మొదురు జల్లులు తప్పా పెద్దగా ఎమీ విపరీతాలు జరిగిన వార్త లేదు.
అలా ఎంతకాలం గడిచిందో తెలీదు. ఓనాడు పొద్దున్నే మేం నిద్దర్లేచే సరికి పరిస్థితి అంతా వేరుగా వుండింది. తూర్పు దిక్కును శాశించిన కారుమబ్బులు చెల్లా చెదురై వున్నాయి! అందరం ఒకర్నొకరం ఏం జరిగిందంటే ఏం జరిగిందని ప్రశ్నించుకున్నాం. " ఆ పడమటి మబ్బులు ఈ తూర్పు మబ్బుల్ని మింగేశాయి, ఇంకే మాత్రం పోటీ లేదు, ఇంకే ప్రళయం రాదు " అని ఆ పటమటి నించి వచ్చిన పెద్దలు చెప్పారు.
కాబోలు ననుకున్నాం, కొంత తెరిపి దొరికిందనుకుని భయంగానూ, భక్తితోనూ ఆ పటమటి మబ్బుల్లోకి చూశాము. మా కుర్రకారైతే మరీను! మరింక ఏ ప్రమాదమూ లేదంటూ అందరికన్నా తమకే ఎక్కువ తెలిసినట్టు వాదించటం మొదలు పెట్టారు. కొందరం మాత్రం, " ఈ తూర్పు నించి వచ్చిన పెద్దల్ని కూడా అడిగి చూద్దాం " అన్నాం. ఎందుచేతనో ఆ ఆలోచన అందరికీ నచ్చినట్లు లేదు. ఆ పెద్దలు కూడా మునుపటిలా అంతగా ఉత్సాహం చూపించట్లేదు, అంత ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ వాళ్ళంతా ఒక్కటే మాట గొణిగారు. " అసలు ప్రమాదం ఇప్పుడే ప్రారంభమవుతోందీ, ఆ పోటీ మేఘాలు తిరిగొచ్చేలోగా అందరం కొట్టుకు పోకుండా వుంటే చాలు" అంటూ. వాళ్ళ నెవ్వరూ పెద్దగా పట్టించుకున్న జాడ లేదు.
సరే, ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఓనాడు అర్థరాత్రి ఆ మబ్బులు ఒక్కసారిగా ఉరమటం మొదలు పెట్టాయి. ఒకటే మోత. ఏంటది, ఏంజరుగుతోందా అని చూశాం. తూర్పూ, పడమరా కలిచే చోట మధ్యలో, కొద్దిగ తూర్పు వైపే, ఈ మేఘాలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయిట. చాలామందే పొయ్యారని వార్త. అది ఆరంభం మాత్రమే అని అప్పటికింకా మాకు తెలీదు. ఆ తర్వాత అలాటి వార్తలు మాకు అలవాటయి పోయాయి.
మా కుర్రకారు, ఆ పటమటి నించి వచ్చిన పెద్దలు మాత్రం " ఇదంతా మానవ కళ్యాణమే, ఆ పోతున్న వాళ్ళంతా పోదగిన వాళ్ళే, ఆ తూర్పు మేఘాలు రానంత కాలం అంతా కళ్యాణమే" అని అదేపాట మళ్ళీ మళ్ళీ పాడారు.
"ఎవరు పోదగిన వాళ్ళో ఎవరు కాదో నిర్ణయించాల్సింది ఎవరూ ?" అని అడిగితే, ఆ పటమటి మబ్బులకే అన్నీ తెలుసూ, అవే అన్నీ నిర్ణయిస్తాయి అన్నారు!
ఏమో, మాకెందుకో అంత నమ్మకం కలగట్లేదు. పోటీ మేఘాల్ని సమర్థించిన పెద్దల్ని అడిగితే వాళ్ళంటారూ, " వస్తాయర్రా, ఆ పోటీ మేఘాలు మళ్ళీ వస్తాయి. అవి ఒక్కసారిగ ఎలా మాయమయ్యాయో అలాగే మళ్ళీ వస్తాయి. మీరు నిద్దర్లేచి చూసే సరికల్లా, ఆ పటమటి మేఘాల్ని అటు చివ్వరిదాకా తరిమేసి వుంటాయి". అలా అని వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు.
అది నిజమో కాదో తెలీదు కానీ, ఇప్పటికన్నా అదే నయమని మాత్రం మాకు నమ్మకం కుదిరిపోయింది. ప్రతిరోజూ పొద్దున్నే తూర్పు వైపు తిరిగి చూడ్డం ఇప్పటి మా అలవాటు. ఆ పటమటి మబ్బులు మాత్రం ఇంకా ఏదో మూల ఏదో ఒక విపత్తుని సృష్టిస్తున్నాయని మాత్రం వార్తలు రోజూ వింటూనే వున్నాం!
-అక్కిరాజు భట్టిప్రోలు
మార్చ్ 25, 1999