Monday, April 30, 2007

శ్రీకారం

ఒకప్పుడు గుండెకాయ, తలకాయ కవలల్లా ఒకే సైజు లో ఉండి ఒకే మాట మాట్లాడేవి. ఏ సమస్యా ఉండేది కాదు. కాలం గడిచిన కొద్దీ ఒక్కోటీ ఒక్కో కోణంలో పెరిగి (?) పోయి నేనంటే నేనని విసిగిస్తున్నాయి. మనిషికి మనసే కాదు, అర కొర మెదడు కూడా తీరని శిక్షే!! కథలు రాయటం మొదలు పెట్టినా ఇద్దరు బాసుల్లో ఎవరో ఒకరు మొహం మాడ్చుకోవటమే తప్పా కలిసి కంగ్రాట్స్ చెప్పింది లేదు. ఎన్నో ఆలొచనలు వీళ్ళిద్దర్లో ఎవరో ఒకరికి నచ్చక నాలోనే మిగిలి పోతున్నాయి. ఇలా పూర్తిగా ఓ రూపు తెచ్చుకోని ఆలోచనల్ని నలుగురితో పంచుకోవటానికే ఈ బ్లాగు.

నా మొదటి కథ మూడు బీర్ల తరవాత. ఇదసలు కథా కాదా అనే ప్రశ్న కూడా వేశారు అప్పట్లో. అది కథ అయినా కాక పోయినా కథ అని ప్రచురించబడిన నా మొదటి రచన. తన కేమి కావాలో తనకే తెలీని సందిగ్ధంలో ఉన్న ఓ మనిషి తిక్క వాగుణ్ణి రికార్డు చేసే ప్రయత్నం ఆ కథ. మదికీ, మేధకీ మధ్య లింకు తెగ్గొట్టేస్తే మనిషి వింత పశువే. ఆ లింకు తెగ్గొట్ట డానికి వాడిన ట్రిక్ మూడు బీర్లు! అందుకే అదే పేరు ఈ బ్లాగుకి సరిపోతుందనిపించింది!

కొన్ని కొన్ని సార్లు మనం చిన్నప్పట్నించీ మెదిలే కొన్ని భావాలకి అకస్మాత్తుగా ఓ కొత్త పుస్తకం చదవటం మూలంగానో, ఎవరితోనో మాట్లాడ్డం మూలంగానో సమాధానం దొరుకుతుంది. అలాటిదే ఇటీవల నేను చదివిన పుస్తకం "Emotional Intelligence (1, 2, 3)". దీన్ని మా ఆఫీసులో మానేజెమెంట్ కి అవసరమయిన పుస్తకంగా గుర్తించి చదవమన్నారు. నిజం చెప్పొద్దూ... అవసరానికి మించి ఏ మేనేజ్ మెంట్ పుస్తకాన్నీ నేను శ్రద్ధగా చదవలేను. అంతే నిరాసక్తంగా ప్రారంభించినా ఈ పుస్తకంలో నాకు కొన్ని ఊహించని సమధానాలు దొరికాయి.

(ముందుగా ఈ పుస్తకం గురించిన విమర్శలు కూడా చాలాఉన్నాయి అనిచెప్పాలి. ఇది పూర్తిగా "సైంటిఫిక్" ఏమీ కాదనీ, Fortune 500 కంపెనీల కోసమే, వారికి నచ్చేట్టుగా రాసిన పుస్తక మని కూడా విమర్శలున్నాయని పుస్తకం చదివాక అంతర్జాలం లో తెలుసు కున్నాను. అంత లోతుల్లోకి వెళ్ళేటన్ని తెలివితేటలు నాకు లేవు గానీ, ఆ పుస్తకం ఫేస్ వాల్యూ మీద ఆధారంగా మాత్రమే ఈ నా నాలుగు మాటలూను)

ఏమిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. మనకి పుట్టుకతో వచ్చేది ఎమోషనల్ మైండ్. తార్కికంగా ఆలోచించే మెదడు తయారవక ముందే ఇది తయారయి కూర్చుంటుందన్న మాట. ప్రపంచంలో ఎక్కడయినా కోపం, భయం, తాపం, విరహం, ప్రేమ లాంటి ఆవేశాలు మనిషిని కమ్మినప్పుడు శరీరంలో కలిగే భౌతిక మార్పులు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకి
కోపం : ఆయుధాలని తీసుకుని యౌద్ధానికి సిద్దమయే మార్పులు శరీరంలో కలుగుతాయి
భయం : కాళ్ళల్లో రక్త ప్రసరణ హెచ్చుతుంది. పారిపోవడానికి గానీ దాక్కోడానికి గానీ శరీరం సమాయత్త మవుతుంది
సంతోషం: చెడు ఆలోచనలన్నింటినీ తొక్కిపెట్టి, శరీరమంతా శక్తిమంతమవుతుంది... ఆ మంచిని పూర్తిగా అనుభవించి దాచుకోడానికి.
ఆశ్చర్యం : కళ్ళు పెద్దవిగా తెరుచుకుంటాయి సాధ్యమయినంత ఎక్కువ వివరాలను సేకరించ డానికి.

ఇలాగే చంటి పాపకి ఎలా తెలుసు తల్లి స్థనం నోటి దగ్గరకు రాంగానే ఏం చేయాలో?

పాతకాలపు 9 తరగతి తెలుగు మీడియం చదివిన నాలాటి వాళ్ళకి వీటిని "అసంకల్పిత ప్రతీకార చర్యలు" అనీ "క్షోభ్యత" (impulse) అనీ అంటారని తెలుసు. అయితే అవి మన మస్తిష్కాల్లోకి ఎలా వచ్చాయి?

ఎవల్యూషన్లో మనని మనం కాపాడు కోవడానికీ, మన సంతతిని వృద్ధి చేసుకోవడానికి అవసరమయిన ఈ లక్షణాలు జన్యుపరంగా మనకి సంక్రమించాయని చెప్పుకోవచ్చు.

ఆతర్వాత తీరిగ్గా మనిషి పెరుగుతున్న కొద్దీ ఆలోచించే మెదడు (neocortex) పెరుగుతుంది. కానీ సైంటిస్టులు కనిపెట్టిందేమిటంటే మన ఆవేశపు మెదడు (emotional mind) ఒక్కోసారి ఏదయినా ప్రమాదమని గుర్తిస్తే, అదే ఇతర శరీర భాగాలకి ఏంచేయాలో చెప్పేస్తుందట. ఆలోచించే మెదడు విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని సరయిన ప్రతిక్రియని తయారు చేసే లోగా జరగాల్సింది జరిగి పోతుందన్న మాట! (Emotional Hijacking).

ఇలా ఇంత పేలవ మయిన Design తో ఎందుకు మన మెదడు తయారయింది అంటే చెప్పిన కారణం, ఎవల్యూషన్ అనేది చాలా మెల్లిగా జరిగే తంతు. మిలియన్ల సంవత్సరాలుగా మన ఆవేశపు మెదడు తయారయితే అతి తక్కువ సమయంలోనే మన ఆలోచించే మెదడు తయారయిందట. ఆది మానవుడు సింహం మీద పడితే వెంటనే ఏదో చేయాలి గానీ, తీరిగ్గా ఆలోచించే సమయం లేదు. అందుకే ఆవేశపు మెదడుకు శరీరం మీద ముందునించీ అదుపు ఉండింది. ఇంకో రకంగా చెప్పాలంటే జంతువులకు ఒక్క ఆవేశపు మెదడే ఉంటుంది, ఆలోచించే మెదడు దాదాపు ఉండదు.

అందుకే, మనం గనక ఆవేశపు మెదడు మీద ఆధారపడి పని చేస్తే ఆటవిక/ఆది మానవుల్లానో, చిన్న పిల్లల్లానో, జంతువుల్లానో ప్రవర్తిస్తామన్న మాట! అందుకే ఒక్కోసారి ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరు మనకే వింతగా తోస్తుంది తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే. అవేశపు మెదడుతో అన్నీ సమస్యలే కాదు, కొన్ని సందర్భాల్లో దాని మూలంగానే బయట పడతాం కూడా! ఆ ఆవేశపు మెదడు లేక పోతే, పూర్తిగా తర్కం మీదే ఆధారపడే స్థితి వస్తే, మనకీ రోబోట్లకీ తేడా ఉండదన్నమాట!

నేనెప్పుడూ (ఈ పుస్తకం చదవక ముందునుంచీ) అనుకునే వాణ్ణి... చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు గానీ నిజానికి వాళ్ళు జంతువులతో సమానమని. ఈ పుస్తకం చదివాక అది రూఢి అయింది. మల్లిక్ చిట్టి కార్టూన్ లయినా, ముళ్ళపూడి బుడుగయినా చుట్టూతా ఉన్న Socially Accepted Behaviour కి బయటే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. నా అనుమానం పిల్లల్లో నిజానికి సహజమైన హింస కూడా దాగి ఉంటుందని. దాన్ని తగ్గించి సంస్కరించడమే వాళ్ళని జంతువులనుండి మనుషులుగా మార్చడం. (Domestication Of Emotions)

ఈ దృష్టిలో చూస్తే అన్ని మతాలూ చెప్పే టెన్ కమాండ్ మెంట్స్ లాంటి సూత్రాలన్నీ ఈ Domestication Of Emotions అనే ప్రక్రియ కోసమే నేమో? హేతు వాదం మీద అచంచలమైన విశ్వాసం ఉన్నప్పటికీ హేతువుకి లొంగని ఇన్ని రకాల నమ్మకాలు, దేవుడూ, దెయ్యమూ, మతమూ తదితరములు ప్రపంచాన్ని ఎలా గుప్పిటిలోకి తీసుకున్నాయో అంటే ఇలా అర్థం చేసుకోవాలా?

ఈ సందర్బంలోనే న్యూయార్క్ టైంస్ లో మతాన్ని శాస్త్రీయంగా (scientific) ఎలా అర్థం చేసుకోవాలీ అన్న దాని మీద ఓ ఆర్టికల్ Darwin's God వచ్చింది. డార్విన్ సిద్దాంతం ప్రకారం ఏ జంతువయినా తన సంతతి వృద్ధి పొందే మార్గంలో (survival) తన ప్రవర్తనని రూపొందించుకుని భావి తరాలకు అందిస్తుంటుంది. మరి ఈ ఎవల్యూషన్ సూత్రంలో మతాన్ని ఎలా అర్థం చేసుకోవటం?
ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ నమ్మటం (Faith) సర్వైవల్ కి ఎదురు నిలుస్తుంది (counter productive) కానీ సహాయం చెయ్యదు కదా! నిజానికీ అబద్ధానికీ మధ్య అంతరం చావునో బతుకునో నిర్ధారిస్తుంది అడవిలో. అక్కడ సింహం ఉంటే ఉంది లేక పోతే లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు, లేని దాన్ని లేనట్టు మాత్రమే నమ్మి ప్రతిక్రియ ఏర్పరచు కోవాలి అక్కడ. ఇక్కడ నమ్మకం (Faith) అన్న దానికి చోటేలేదు. అంచేత survival అనే ఒక్క సూత్రంతో మనిషి మతాన్ని, దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాడో చెప్పలేం!

కాకపోతే పైన చెప్పిన survival అనేది జంతు రాజ్యంలో, అనాగరిక రాజ్యంలో. ఆ రాజ్యంలోంచి ఒక్క సారిగా బయట పడి ఇన్ని తెలివి తేటలుసంపాయించు కున్న మనిషి ఆ జంతు survival instincts లోంచి బయట పడ్డానికే, ఆ ఆవేశపు మెదణ్ణి కాస్త ప్రలోభ పెట్టి, తర్కాన్ని పీఠ మెక్కించడానికి కాస్త మత్తు మందు కావాలి... ఆ మందుకే మతమనీ, ఆచారమనీ, సాంఘిక కట్టుబాట్లనీ ఇన్ని పేర్లు!

ఇంత కాంట్రడిక్షన్ నేను ఇంతకు ముందు వినలా. హేతువుని పీఠమెక్కించడానికి మతం కావాల్సొచ్చిందని తేల్చాం!

అందుకే నాకున్న మరో ప్రశ్న, మనిషి కాకుండా వేరే ఏ జంతువయినా దేవుణ్ణి నమ్ముతుందా అని. అంటే మన శ్రీకాళహస్తి కథలో కనపడే ఏనుగూ, సాలె పురుగూ, పామూ నిజంగా ఉండే అవకాశం ఉందా అని! ఈ పుస్తకమూ, ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నా కనిపించేది... అది సాధ్యం కాదు అని! జంతువులకు Domestication Of Emotions అనేది ప్రమాదం.... మనిషికి అవసరం!

ఇంత ఆలోచించాక అప్పుడు నేను రాసిన మూడు బీర్ల తర్వాత కథ నాకే కొత్తగా అర్థమయింది. నేను చేసిందల్లా ఆ మనిషిలోని ఆలోచనల మెదడికి విశ్రాంతి నిచ్చి, వాడి ఆవేశాలకి పట్టం గట్టి... ఓ జంతువుని సభ్యసమాజం లోకి వదిలి చోద్యం చూశా!

ఇప్పుడదే పని నాకు చేయాల్నుంది ఇక్కడ! అందుకే... ఆ మూడో బీరు కావాలి.... ఎవరక్కడ!!

అక్కిరాజు భట్టిప్రోలు