Thursday, May 31, 2007

రి సైకిల్ : పటమటి మేఘాలు

రచనా కాలం : మార్చి 1999
మబ్బులంటే మాకు భయం!
ఒకప్పుడు రెండు పక్కల్నించీ వస్తుండేవి.
చిక్కగా నల్లగా, భయంకరంగా ఉరుముతూ!
ఏ మబ్బులకింద ఉన్నా మనిలేకుండా అందరం భయపడే వాళ్ళం.
" అదుగో, ఆ మబ్బులు ఢీకొంటే, అమ్మో ఇంకేముందీ? అంతా ప్రళయమే, అందరూ ఊడ్చిపెట్టుకు పోతారూ " అని భయ పెట్టేవాళ్ళు. అందరం అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ చూస్తుండే వాళ్ళం.
అవి పోటా పోటీగా ఉరుముతూ వుండేవి, భయపెడుతూ వుండేవి. అవి చెరో ప్రక్కనించీ ఊరంతటినీ ఎంత దొరికితే అంతమేరకు కమ్మేశాయి. వాటికి పోటీ, "నువ్వెంత నాశనం చెయ్యగలవో నేనంతకన్నా ఎక్కువే చెయ్యగలను " అంటున్నట్టుగా వుండెవి. వూరంతా సగానికి విడిపోయింది. సగం ఆ మబ్బులకింద, సగం ఈ మబ్బులకింద!
మాకంతా అయోమయంగా వుండేది.
కొందరు పెద్దలు పటమటి దిక్కుగా వెళ్ళారు. కొందరు అందుకు విరుధ్ధంగా తూర్పుకు వెళ్ళారు. మరికొందరు ఒక అడుగు అటుకి ఒక అడుగు ఇటుకి వేస్తూ ఎటూ వెళ్ళకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే వున్నారు. కానీ అందరికీ గుబులుగానే వుండేది. అడుగడుక్కీ తలెత్తి పైకి చూస్తూనే వుండే వాళ్ళం. ప్రతి రోజూ దుర్వార్తలకోసమే ఎదురుచూస్తూ వుండే వాళ్ళం. కానీ ఏవో అక్కడా ఇక్కడా చెదురు మొదురు జల్లులు తప్పా పెద్దగా ఎమీ విపరీతాలు జరిగిన వార్త లేదు.
అలా ఎంతకాలం గడిచిందో తెలీదు. ఓనాడు పొద్దున్నే మేం నిద్దర్లేచే సరికి పరిస్థితి అంతా వేరుగా వుండింది. తూర్పు దిక్కును శాశించిన కారుమబ్బులు చెల్లా చెదురై వున్నాయి! అందరం ఒకర్నొకరం ఏం జరిగిందంటే ఏం జరిగిందని ప్రశ్నించుకున్నాం. " ఆ పడమటి మబ్బులు ఈ తూర్పు మబ్బుల్ని మింగేశాయి, ఇంకే మాత్రం పోటీ లేదు, ఇంకే ప్రళయం రాదు " అని ఆ పటమటి నించి వచ్చిన పెద్దలు చెప్పారు.
కాబోలు ననుకున్నాం, కొంత తెరిపి దొరికిందనుకుని భయంగానూ, భక్తితోనూ ఆ పటమటి మబ్బుల్లోకి చూశాము. మా కుర్రకారైతే మరీను! మరింక ఏ ప్రమాదమూ లేదంటూ అందరికన్నా తమకే ఎక్కువ తెలిసినట్టు వాదించటం మొదలు పెట్టారు. కొందరం మాత్రం, " ఈ తూర్పు నించి వచ్చిన పెద్దల్ని కూడా అడిగి చూద్దాం " అన్నాం. ఎందుచేతనో ఆ ఆలోచన అందరికీ నచ్చినట్లు లేదు. ఆ పెద్దలు కూడా మునుపటిలా అంతగా ఉత్సాహం చూపించట్లేదు, అంత ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ వాళ్ళంతా ఒక్కటే మాట గొణిగారు. " అసలు ప్రమాదం ఇప్పుడే ప్రారంభమవుతోందీ, ఆ పోటీ మేఘాలు తిరిగొచ్చేలోగా అందరం కొట్టుకు పోకుండా వుంటే చాలు" అంటూ. వాళ్ళ నెవ్వరూ పెద్దగా పట్టించుకున్న జాడ లేదు.
సరే, ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఓనాడు అర్థరాత్రి ఆ మబ్బులు ఒక్కసారిగా ఉరమటం మొదలు పెట్టాయి. ఒకటే మోత. ఏంటది, ఏంజరుగుతోందా అని చూశాం. తూర్పూ, పడమరా కలిచే చోట మధ్యలో, కొద్దిగ తూర్పు వైపే, ఈ మేఘాలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయిట. చాలామందే పొయ్యారని వార్త. అది ఆరంభం మాత్రమే అని అప్పటికింకా మాకు తెలీదు. ఆ తర్వాత అలాటి వార్తలు మాకు అలవాటయి పోయాయి.
మా కుర్రకారు, ఆ పటమటి నించి వచ్చిన పెద్దలు మాత్రం " ఇదంతా మానవ కళ్యాణమే, ఆ పోతున్న వాళ్ళంతా పోదగిన వాళ్ళే, ఆ తూర్పు మేఘాలు రానంత కాలం అంతా కళ్యాణమే" అని అదేపాట మళ్ళీ మళ్ళీ పాడారు.
"ఎవరు పోదగిన వాళ్ళో ఎవరు కాదో నిర్ణయించాల్సింది ఎవరూ ?" అని అడిగితే, ఆ పటమటి మబ్బులకే అన్నీ తెలుసూ, అవే అన్నీ నిర్ణయిస్తాయి అన్నారు!
ఏమో, మాకెందుకో అంత నమ్మకం కలగట్లేదు. పోటీ మేఘాల్ని సమర్థించిన పెద్దల్ని అడిగితే వాళ్ళంటారూ, " వస్తాయర్రా, ఆ పోటీ మేఘాలు మళ్ళీ వస్తాయి. అవి ఒక్కసారిగ ఎలా మాయమయ్యాయో అలాగే మళ్ళీ వస్తాయి. మీరు నిద్దర్లేచి చూసే సరికల్లా, ఆ పటమటి మేఘాల్ని అటు చివ్వరిదాకా తరిమేసి వుంటాయి". అలా అని వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు.
అది నిజమో కాదో తెలీదు కానీ, ఇప్పటికన్నా అదే నయమని మాత్రం మాకు నమ్మకం కుదిరిపోయింది. ప్రతిరోజూ పొద్దున్నే తూర్పు వైపు తిరిగి చూడ్డం ఇప్పటి మా అలవాటు. ఆ పటమటి మబ్బులు మాత్రం ఇంకా ఏదో మూల ఏదో ఒక విపత్తుని సృష్టిస్తున్నాయని మాత్రం వార్తలు రోజూ వింటూనే వున్నాం!
-అక్కిరాజు భట్టిప్రోలు
మార్చ్ 25, 1999

Wednesday, May 23, 2007

రిసైకిల్ : శీతవేళ రానీయకు రానీయకు!

రచనా కాలం : జూన్ 1999
నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2)
__________________________

కృష్ణశాస్త్రి
అమృతవీణ (గేయసం హిత - 1)
గేయం - 141
__________________________


శీతవేళ రానీయకు - రానీయకు
శిశిరానికి చోటీయకు - చోటీయకు
ఎద లోపలి పూలకారు
ఏ నాటికీ పోనీయకు
శీత.....

ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా
అదరి పోవకు - ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా
లెక్క చేయకు - లెక్క చేయకు
శీత.....

చైత్రంలో తొగ రెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కై పెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో - మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను - నీలోకం నిలుపుకో
శీత......

ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపు టడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించు - వీలు కా దనీ పంపించు
శీత....

______________________

(ఇక్కణ్ణించి నా గోల)

ఆ గీతం చదవని వాళ్ళు వుంటారేమోగానీ, వినని వాళ్ళు ఉంటారని నేనను కోను. ఈ గీతాన్ని అద్భుతమైన సినిమా పాటగా మలచి ' మేఘసందేశం ' సినిమాలో వాడారు. రమేష్ నాయుడు సంగీత దర్శకుడు. జేసుదాసు, సుశీలలు ఈ పాటకి పూర్తిగా న్యాయం చేశారు. కవితలో వున్న ఆవేశాన్ని పూర్తిగా వినిపించ గలిగిన ఈ ముగ్గురూ అభినందనీయులు. కృష్ణ శాస్త్రివే "ఆకులో ఆకునై", "ముందుతెలిసెనా ప్రభూ" అనే గీతాల్ని కూడా ఈ సినిమాలో వాడుకున్నారు.... చాలా చక్కగా!

ఇది సినిమా పాట అవటం మూలంగానే నేనిన్ని సార్లు వినగల్గాననేది, అందుమూలంగానే ఇది నన్నింతగా ఆకట్టుగో గలిగిందనేవి నిజాలు.

ఏవిటీ ఈ పాటలో వున్నదంటారా..... అబ్బో చాలా వుంది! ఈ పాట నేను చాలా కాలం నుండీ వింటున్నాను. జాగ్రత్తగా వినండి, నో, చదవటం సరిపోదు, అర్జంటుగా కాసెట్ కొని వినండి. ఇందులో 1000 విటమిన్ లున్నాయి, వయసుని పెరక్కుండా నియంత్రించే మంత్రం వుంది... నిజంగా!!

నిస్సత్తువలో, నీరసంలో, అలసి, వోడిపోతున్న క్షణాన ఈ పాట పెట్టుకుని కళ్ళుమూసుకుని, గట్టిగా గొంతు కలిపి పాడండి.......

" ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదరి పోవకు
ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా లెక్క చేయకు
లెక్క చేయకు
శీత..... "

ఈ చరణం పూర్తయ్యేసరికి కొత్త వుత్సాహం, కొత్త ధైర్యం వస్తాయి. నో! ఈ పాట మీకు నిజాన్ని మరిపించి, పరిస్థితుల్నించి దూరంగా పారిపొమ్మని చెప్పదు. అలా వో కొత్త భావ ప్రపంచాన్ని తయరుచేసి మిమ్మల్ని ఆ మత్తులో ముంచెత్తదు. అలాంటి పనికిరాని ' రొమాంటిక్ ' కవిత్వం కాదిది. నిజానికి ఇది మీకు 'ఓటమికి ' తావులేదని చెపుతుంది. ఓటమిని అంగీకరించద్దని చెపుతుంది. కొత్త ఉత్సాహంతో మళ్ళీ నడుంకట్టమని చెపుతుంది. ' పెను నిద్దర వదిలి ' ' మును ముందుకు ' పొమ్మంటుంది. లెక్కచేయకు అంటుంది కానీ, పారిపోమని చెప్పదు!

కట్టలు తెంచుకున్న ఆనందోత్సాహంలో ఉన్నప్పుడు. చుట్టూతా వున్న వాళ్ళందరూ ఆకాశానికెత్తేసి, ఇంద్రుడివీ, చంద్రుడివీ అని పొగిడేస్తున్నప్పుడు, క్షణాలు, నిమిషాలు, గటలు, రోజులు వడివడిగా హాయిగా సాగిపోతున్నప్పుడు..... అప్పుడు.... కొంచెం సందు చూసుకుని వంటరిగా కూర్చుని ఈ పాట వినండి.........

" చైత్రంలో తొగ రెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కై పెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో - మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను - నీలోకం నిలుపుకో
శీత...... "

అంతే... ఈ చరణం పూర్తయ్యేటప్పటికి వళ్ళు జలదరిస్తుంది. నో! ఈ ఆనందం, ఈ సౌఖ్యం, ఇవన్నీ మాయలనీ, మిథ్యలనీ, అశాశ్వతాలనీ, నిష్ప్రయోజనాలనీ మెట్టవేదాంతం చెప్పి, మిమ్మల్ని నిర్వీర్యం చెయ్యదీ పాట! అందుకు విరుద్ధంగా.... మీ కళ్ళద్దాలు మీకు తెలియకుండానే మరింత దూరం చూడ్డం మొదలు పెడతాయి. అయ్యో మరికెంత మిగిలిపోయిందా నేచూడాల్సిందీ అనే తపన మొదలవుతుంది. మీ లక్ష్యాలూ, ఆశలూ, ఆదర్శాలూ, ఆవేశాలూ.... అన్నీ కొత్త శక్తులు నింపుకుంటాయి. నూతనోత్సాహం, కొత్త ప్రయాణం, కొత్త పరీక్షలు, కొత్త వెలుగులు, కొత్త గెలుపులు, కొత్త వోటములు.......

ఇలా సాగీ సాగీ....... ఓనాడు మీకు (మీకు... మీకే), అబ్బో చాలా దూరం వచ్చేశామే అనే అనుమానం వస్తుంది. చుట్టూతా వున్న వాళ్ళంతా కూడా (మీతో పాటు బయల్దేరిన వాళ్ళే) చతికిల పడి కూర్చుని, " ఒరే వెంకట్రావూ! ఇంకా ఎందుకురా ఈ తపన, ఇంకేం చెయ్యగలవు చెప్పు? హాయిగా కాళ్ళు జాపుకుని యములోడొచ్చేదాకా కూర్చోలేవు " అని చెపుతారు. ఈ మాట, మీరు చదివే పుస్తకాలని పట్టీ, తిరుగుతున్న మనుషుల్ని బట్టీ, చూస్తున్న ప్రదేశాలని బట్టీ మీకు 100వ ఏట గానీ, 80వ ఏట గానీ, 40వ ఏట గానీ, 20వ ఏట గానీ, 10 వ ఏట గానీ చివరికి... 5వ ఏట కూడా వినబడగలదు!! ఈ వృద్ధాప్యం, దాందుంప తెగ, ఏవయసులో నయినా రాగలిగిన జబ్బు, జాడ్యం. కానీ ఆ మాట వినపడ్డ వెంటనే వాళ్ళతో పాటు చతికిలబడకండి..... ఒక్కసారి ఈ పాట వినండి.....

" ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపు టడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించు - వీలు కా దనీ పంపించు
శీత.... "

ఈ చరణం పూర్తయ్యే సరికల్లా మీరు...... గాలిపటానికి సూత్రం కట్టి, ఎగరేయటానికి గోదారొడ్డుకి వెళ్ళ్తూ వుంటారు. జాగ్రత్త, పరిగెట్టకండి, పై జేబులో గోలీలు కింద పడిపోగలవు!! ఇదీ ఈ పాటలో ఉన్నది..... శక్తి, energy, power!

P.S. " ఎంత వయసొచ్చినా ఈ కోతి వేషాలు మానవేమిరా " అనే మా అమ్మకి మాత్రం చెప్పకండేం ఈ పాట గురించి!

- అక్కిరాజు భట్టిప్రోలు

Tuesday, May 15, 2007

జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!

(విన్నపం : హమ్ ఆప్కే హై కౌన్, సాజన్, కహోనా ప్యార్ హై, టైటానిక్, నువ్వు నాకు నచ్చావు ఇత్యాదులు గొప్ప సినిమాలు అని నమ్మేవాళ్ళు దయచేసి దీన్ని చదవద్దు! )
_________________________________________________

"జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!"


నూటికి నూరు పాళ్ళూ సీతారామ శాస్థ్రి నన్ను చూసే రాశాడు అంటాను... మూడు బీర్లకి ముందైనా తర్వాతైనా!


"నీకు నా బాధలు తప్పా ప్రపంచం బాధలు బానే కనపడతాయి." అనే మా ఆవిడే సాక్షి మొదటి మాటకి.
అందరూ తెగ ఫీలయి పోయే వీర సెంటిమెంటు సినిమా చూస్తూ పగలబడి నవ్వి చుట్టు పక్కల అందరి తిట్లూ తింటం రెండో మాటకి సాక్ష్యం.


సిమ్లాలో హోటల్లో కూర్చుని ఇది రాస్తున్నాను. మా పెళ్ళయి పదేళ్ళయిందని ఓ పది రోజుల ఉత్తర భారత పర్యటనలో ఉన్నాం లెండి. సరే పదేళ్ళ క్రితమే జరిగిందాన్ని తలుచుకుని మురిసి (??) పోవడానికి మేం వస్తే, ఇక్కడ మాకు హిందీ సినిమాలు చూపిస్తున్నారు. డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్ కి వెడితే దాందుంప తెగ ఒక సమస్యా నాకు? మొత్తం టేబిల్ చుట్టూ నాలుగు జంటలు... పెళ్ళయి బహుశా వారం కూడా అయ్యుండదు. ఒకానొక ఊహా ప్రపంచంలో తేలియాడుతూ... అబ్బో చెప్పేందుకు మాటలు చాలవు (?)! మా ఖర్మానికి ఈ హోటల్ పేరు హనీమూన్ ఇన్! రోకట్లో తల పెట్టి ఇప్పుడు వగచి ప్రయోజనం ఏముంది! చుట్టూతా ఒకటే సీన్లు ??!!?


నువ్వు నాకు ఫొటో తియ్యి... నేను నీకు తీస్తా!
నువ్వలా నాజూకుగా అయిస్క్రీం నోట్లో పెట్టుకో... నేను నీకు వీడియో తీస్తా!
నీకెందుకు కష్టం... నేను తెచ్చిస్తాగా... !
ఇలా తల పెట్టు... ఈ గులాబీ నీ తల్లో పెడతా!


ఇక మా సంగతి! మా అమ్మాయి (7 సంవత్సరాలు) అది ఏ నక్షత్రంలో పుట్టిందో తెలీదు గానీ అది నా తెలివి తేటల్ని పరీక్షించని క్షణం లేదు గత ఏడేళ్ళలో! మా అమ్మాయికి ఉన్న చెడ్డ లక్షణం నిజాలు మాట్లాడటం మాట్లాడి తీరటం! అది పొర బాటున ఏ నిజం మాట్లాడుతుందో నని తెగ భయపడి పోవటం నా వంతు. "ఏం ఆ అంకుల్ ఎందుకు ఆంటీకి అయిస్క్రీం తిని పిస్తున్నాడు.... పాపం ఆంటీ చేతికి దెబ్బ తగిలిందా" అని గట్టిగా అడిగితే ఏం చెయ్యడం?


దానికి తగ్గట్టు.. ముఖ్యమంత్రి చుట్టూ అయ్యేయెస్సులు పరిగెట్టినట్టినట్టు... నేనూ మా ఆవిడా మా అమ్మాయి చుట్టూ పరిగెట్టినా... ఏదో తేడా జరగనే జరుగుతుంది దానికి. ఇక దాన్ని సముదాయించ డానికి ఓ పెద్ద హైడ్రామా తప్పదు.


మా ఆవిడ "మనం తప్పు ప్లేసుకి వచ్చామేమో" అంటుంది పైగా చుట్టూ చూసి... కడుపు మండేట్టు. అప్పుడే అంత ముసలాళ్ళ మయిపోయామా అంటాను కసిగా... మా అమ్మాయి పడేసుకున్న ఫోర్క్ కి రెప్లేస్ మెంట్ తేవడానికి పరిగెడుతూ... అది అంతర్జాతీయ సమస్య కాకముందే!


"సరే అక్కడికేదో నిజంగా వయసులో ఉన్నప్పుడేదో సాధించినట్టు" అంటుంది మా ఆవిడ.


"వాడ్డూయూమీన్ " అంటాను మేక పోతు గాంభీర్యంతో .. ఏం వినాల్సొస్తుందోనని భయంతో!


"ఏ నాడూ ఇలా నన్ను వీడియో తీసిన గుర్తు గానీ, నా తల్లో గులాబీ గుచ్చిన గుర్తుగానీ లేదు" అంటుంది


"అలా నా చొక్కా మీద పడ్డ కెచప్ ని నీ చున్నీ తో తుడిచిన గుర్తు నాకూ లేదు" అంటాన్నేను.. నేనేమన్నా తక్కువ తిన్నానా!


ఇక ఇది గాలివాన గా మారేలోపు మా అమ్మాయి... సడెన్ గా "నేను బాత్రూం కెళ్ళాలీ" అంటుంది చుట్టూ అందరికీ విన పడేలా. సీదా డైనింగ్ టేబిల్ నించి మాఆవిడ దాన్ని ఒక్క గుంజు గుంజి "పద మరి" అని పరిగెడుతుంది దాన్ని తీసుకుని. పి.టి. ఉష, షైనీ అబ్రహాం గుర్తొస్తారు నాకు. దెబ్బకి చుట్టుపక్కల డ్రీమ్ సీక్వెన్సులన్నీ కంట్రోల్-ఆల్ట్-డెల్ అయిపోతాయి! కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం కాదు నాయన లారా వాటి పర్యవసానం డైపర్లూ, బాత్ రూముల ప్రహసనాలే అనే నగ్న సత్యాన్ని మా అమ్మాయి వాళ్ళకి చెప్పేస్తుంది.


(ఇలా డైనింగ్ రూంనించి భోజనం మధ్యలో బాత్రూముకు పరిగెట్టని అమ్మానాన్న లెవరన్నా ఉంటే చూడాలని ఉంది)


వాళ్ళు తిరిగొచ్చేలోపు అయిస్క్రీం తింటూ, క్రీగంట పక్క టేబిల్ మీద కొత్త పెళ్ళికూతుర్ని చూస్తూ ఆలోచిస్తా...


ఇంత ప్రదర్శన అవసరమా... ఇది నిజంగా నిజమేనా అని. ఏవో చిన్న సరదాలు, సరసాలు, ముద్దు ముచ్చట్లూ కూడా తప్పంటే ఎట్లా... అంటే... నేనేం చెప్పలేను! తప్పు ఒప్పుల సమస్య కాదు.... అదో స్టాండర్డ్, బెంచ్ మార్కు అయి పోవడం విసుగురావట్లేదా ఎవరికీ? ఆవేశాలని ఇలా ఫైవ్ పండిట్ గైడ్ చదివి నట్టు అందరూ తు.చ తప్పకుండా బట్టీకొట్టి పాటిస్తుంటే ఇంకెవ్వరికీ ఇబ్బందిగా లేదా?


ఇప్పుడు నాకు తెలిసి మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే, సెక్రెటరీస్ డే, డాక్టర్స్ డే ... కుక్కల డే, బొద్దింకలడే .. చాలా వచ్చేశాయ్ (ఒ.కె... చివరి రెండు నాకు ఒళ్ళు మండి చేర్చా!). వాడు ఆర్చీస్ వాడూ, హాల్ మార్క్ వాడూ చెపుతాడు... మాఆవిణ్ణి, మాఅమ్మనీ నేను ఎలా ప్రేమించాలో... ఈ దేశంలో ప్రేమకి కొలబద్ద వాడి బాటం లైన్!


ఈ నాకొడుకులకి నే చెప్పేదేంటంటే... ప్రపంచంలో ప్రతి వాడూ వాళ్ళ అమ్మని ప్రేమిస్తాడు. అమెరికా వాడయినా, ఆఫ్రికా వాడయినా, భారతీయుడయినా ఎవడూ వాళ్ళమ్మని తక్కువేమీ ప్రేమించడు! మా అమ్మ బర్త్ డే ఎప్పుడో నాకు ఎప్పుడూ తెలీదు... గుర్తులేదు? అయితే ఏంటిట? ఓ సారి మా అమ్మ దక్కర కెళ్ళి నా గురించి ఏమన్నా చెడుగా అని చూడండి... జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాను!


చిన్న తనంలో (ఇంటర్మీడియట్ ప్రాంతంలో) ఓ సారి టి.వి లో ఓ ఇంటర్వూ వచ్చింది. ఒకానొక ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద వంట వాడు (చెఫ్) ఏదో పేద్ద పేరు తెచ్చుకున్నాడు... సరిగ్గా గుర్తులేదు వాడికేదో ఎవార్డు వచ్చినట్టుంది. వాణ్ణి బోలేడు ప్రశ్నలు వేశారు. అంతా బాగుంది.. చివర్లో వచ్చింది అసలయిన ప్రశ్న! మీరు ఇంత పేరు తెచ్చుకున్నారు కదా... ఇప్పుడు మీకు మీరు చేసిన వంట నచ్చుతుందా... లేక మీ అమ్మ చేసిన వంట నచ్చుతుందా అని! వాడు తడువుకోకుండా "మా అమ్మ వంటే.. అందులో మా అమ్మ ప్రేమ కూరి ఉంటుంది కదా?" అన్నాడు..


నేను కుర్చీలో తెగ ఇబ్బందిగా కదలటం ఎవరూ గమనించలా. కాపోతే... నాచుట్టూ ఉన్న వాళ్ళు తెగ ఆనంద పడి పోయి కళ్ళు తుడుచుకోవటం నాకు ఇప్పటికీ ఒళ్ళు మండించే వ్యవహారం.


ఒక్కటి చెప్పండి! ఏవిటా ప్రశ్న.... ఈ భూప్రపంచంలో ఎవడన్నా టి.వి. కెమెరా ముందు కూర్చుని ఆ ప్రశ్నకి వేరే ఏదన్నా సమాధానం చెప్తారా? మరా ప్రశ్న అడగట మెందుకు... అది విని అంత తెగ ముచ్చట పడి పోవట మెందుకు?


అమెరికన్ వీసాకి అప్లై చేసిన వాళ్ళకి తెలుసు ఇలాంటి ప్రశ్నలు.
"నువ్వెప్పుడన్నా డ్రగ్స్ అమ్ముతూ కానీ, వాడుతూ కానీ పట్టుబడ్డావా?"
"నువ్వు అమెరికా వెళ్ళి అక్క డే ఉండి పోయే ఉద్దేశం ఉందా?"
"నీకు ఊరంతా అంటించే భయంకరమైన అంటురోగం ఉందా?"


ఈ ప్రశ్నలకి "అవును" అని సమాధానం చెప్పే వాడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండి ఉంటాడా? అలాంటిదే ఆ పై ప్రశ్న కూడా! ఎప్పుడన్నా అవకాశం రావాలి గానీ కావాలని ఇలాటి వాటికి తిక్కగా సమాధానం చెప్పాలని నాకు మా చెడ్డ కోరిక

"మా అమ్మ వంటా... పరమ చెత్త. సరయిన భోజనం చెయ్యాలంటే నాదక్కరకే రండి" అని చెప్పి చోద్యం చూడాలన్న మాట.... "నువ్వు కావాలనుకునే సమాధానం నేను చెప్పనూ ... ఎక్కడ దూకుతావో దూకు" అని మనం ప్రత్యేకంగా అనఖ్ఖర్లా... వాడికి అర్థమయిపోతుంది!


నా ఆలోచనల్లోంచి బయట పడేలోపు మా అమ్మాయి, ఆవిడా తిరిగి వస్తారు.


నేను రాజీ పడే ప్రయత్నంలో... "సరే... రేపు మారేజ్ డేకి ఫ్రెంచ్ షాంపేన్ కొంటాను చూడు మనాలి వెళ్ళేలోపు" అంటాను


మా ఆవిడ మొహం చిట్లించి "నీకు షాంపేన్ తాగాలంటే తాగు.. ఈ డొంక తిరుగుళ్ళెందుకు. నువ్వంత నిజంగా ఫీలయి పోతే మనాలి లో మంచంతా కరిగి పోతుంది. అనవసరంగా ప్రయత్నించకు" అంటుంది.


విచిత్రంగా నాకు... కోపంరాదు... పదేళ్ళలో ఎంత అర్థంచేసేసు కుంది మా ఆవిడ నన్ను అని తెగ ఫీలయ్యి పోతా! ఇంకే షాంపేన్ బాటిలూ అక్కర్లా!


(ఓ పరమ కర్కోటకపు మొరటు తనాన్నించి... పదేళ్ళలో నన్ను ఎంతో కొంత సంస్కరించిన పరమ దుర్మార్గురాలు... మా ఆవిడకి!)

Thursday, May 3, 2007

రిసైకిల్ : యంత్రలాభం

రచనా కాలం : ఏప్రిల్ 2001
నా ఒరిజినల్ పోస్టు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ


తెల్లవార్తుంది. యంత్రంలా లేస్తాను కాళ్ళూ చేతులూ మొహం... యంత్ర భాగాలన్నీ శుభ్రం చేసుకుంటాను. యాంత్రిక దినచర్య ప్రారంభమవుతుంది. ఇతర యంత్రాలని కలుస్తూ మాట్లాడుతూ దాటుకుంటూ దినచర్య సాగిపోతూ ఉంటుంది. కొన్ని యంత్రాలకి చక్రాలుంటాయి. మరికొన్నిటికి రంగురంగుల లైట్లుంటాయి. కొన్నిటికి గేర్లూ స్క్రూలూ బోల్ట్లూ ఉంటాయి. కొన్నిటికి మాత్రం నాలాగే కాళ్ళూ చేతులూ తలా మొండెం ఉంటాయి.

కొన్ని పెట్రోలు తాగుతాయి. కొన్ని డీజెల్ని మింగుతాయి. కొన్ని కరంటుతో పని చేస్తాయి. కొన్ని అన్నం, బ్రెడ్డు, పాస్టా, పిజ్జా తింటాయి. కానీ వాటన్నిటికీ మాత్రం దినచర్య ఎవరో ముందుగానే సిద్దంచేసి వుంటారు. ఎవరో గీసిన గీతల వెంట వురుకులూ పరుగులూ.


అలానే ఈ రోజు కూడా సాగిపోతూ వుంటుంది. మరో దినం.... మరో గండం. రోజంతా మాలో మాకు పోటీ. ఒకళ్ళ వంక ఒకళ్ళం ఎప్పుడూ అనుమానంగా భయంగా చూసుకుంటూ వుంటాం. ఏ వుక్కుపాదమో నా పీక మీద అడుగేసి ముందుకెళ్ళిపోతుందేమోననే ఆదుర్దా ఎప్పుడూ నా వెన్నంటే వుంటుంది. ఏ అమెరికా మంత్రమో, జర్మనీ యంత్రమో తమని చెత్త బుట్టలోకి చేర్చేస్తుందేమోనని స్వదేశీ యంత్రాల భయం. అంతా పీచు పీచు మంటూ గొర్రెపోతుల్లా గంభీరంగా పని చేసుకుపోతుంటారు.


నిజం చెప్పొద్దూ... నా కాళ్ళనీ చేతుల్నీ చూసుకుంటుంటే అసహ్యం వేస్తుంది నాకు. ఈ కొరగాని ఎముకల్ని పీకేసి, నాలుగు ఉక్కు ముక్కలూ పేర్చుకుంటే బాగుణ్ణనిపిస్తుంది. మరో నాల్గు రోజులు ఎక్కువ తిండి దొరికే అవకాశం వుండొచ్చు. నాకనిపిస్తుంది, సృష్టి కర్తనేవాడే వుంటే చెప్పాలని, మనిషిని రి-డిజైన్ చెయ్యాల్సిన సమయం వచ్చిందని. ఈ తోలు లివర్నీ పీకేసి ఓ హైడ్రాలిక్ లీవర్ని పెట్టాలి. ఈ తోలు గుండె స్థానంలో ఓ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ పెట్టాలి. లేకపోతే ఈ అధునిక యుగంలో బతికేదెట్టా?


ఆలోచనల్లోనే రోజు గడిచి పోతుంది. బతుకుజీవుడా అనుకుంటూ యాంత్రికంగానే కదుల్తాను. రాత్రిక్కూడా విశ్రమించని, విశ్రమించ నవసరంలేని యంత్రాల వంక అసూయతో, భయంతో చూస్తూ. మరో రోజు బతికేసినందుకు నన్ను నేను అభినందించు కుంటాను.

యంత్రలాభం ఎంత లాభమో స్టాక్ ఎక్చేంజిలోనూ అడగొచ్చు, స్మశానంలోనూ అడగొచ్చు.... మనకేది దగ్గరయితే అది.

-అక్కిరాజు భట్టిప్రోలు

Wednesday, May 2, 2007

రిసైకిల్ : టైటానికి కథ గురించి

కథ : టైటానిక్ (తానా బహుమతి పొందిన కథ)
రచయిత : సురేష్
కథ ప్రచురణ కాలం : జులై 2001
నా అనాలిసిస్ రాసిన కాలం : జులై 2001
నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2)
__________________________________________


"....యేరుశనగ మిరపల వర్తకాల్లో కొందరిని జంక్సను కాడ మిల్లులు, మరికొందర్ని టేశను కాడ మిల్లులు - పెద్ద వర్తకులు - యీలకన్న లోకం సూసినోల్లు - యీల్లను ముంచీసినారు. అయితే ఆ మిల్లులన్న ఇప్పుడున్నాయా? ఆట్నన్నింటిని అంతకన్న పెద్దమిల్లులు ఆవదాలవలసవి మింగీసినాయి. మరి అవైన వుంటాయా? నాకు తెల్దు గాని ఆట్ని కూడ మింగుతున్నవీ, మింగబోయేవీ ఎక్కడో ఏవో పుట్టి పెరుగుతూనే వుంటాయి...." అంటాడు అప్పల్రావుడు యజ్ఞం కథలో.


అప్పల్రావుడి వుపన్యాసంలో తనకి తండ్రి దగ్గర్నించి వచ్చిన రెండు తులాల బంగారం, యీసిన్నర యెండి, కొంత భూమి ఎలా న్యాయబద్ధంగా చేతులు మారాయో చెపుతాడు. 1964 లో రాసిన కథ యజ్ఞం. ఆముదాలవలస మిల్లుదాకా చూడగలుగుతాడు అప్పల్రావుడు. మరాతర్వాత ఏంజరిగింది? అతగాడి ఆ ఆస్థి ఇన్నేళ్ళ తర్వాత కొత్త శతాబ్దిలోనైనా దారి మార్చి వెనక్కి వచ్చే సూచనలేమైనా కనపడుతున్నాయా? కనీసం ఏ సరిహద్దుదగ్గరన్నా చేరి స్థిరపడిందా? లేదూ, ఉన్న సరిహద్దుల్ని కూడా దాటేసి కొత్త తీరాలకి చేరుతోందా? దానికి సమాధానమే టైటానిక్ కథ. అప్పల్రావుడు చెప్పినట్టుగా ఆ " చిన చేపని పెద చేప, చిన మాయను పెను మాయ " కథ నడుస్తూనే వుంది, విసుగూ విరామం లేకుండా.


"... ఎవరి పరిస్థితి బాగుందని? స్వతంత్రని వదిలేశాక నాకు మాదాపూర్ లో జాబొచ్చింది. రెండేళ్ళు బానే గడిచాక ఇవాళ పొద్దున మాకంపెనీ బోర్డు మారిపోయింది. రాత్రే శాంస్ ఇంక్ వాళ్ళు మా సాఫ్ట్ వేర్ కంపెనీని వోవర్ టేక్ చేశారు. ఇక్కడి కంటే చైనాలో బెటరని హైదరాబాదు కంపెనీని మూసేశారు ..." ఇవి శ్రీహరి మాటలు, టైటానిక్ లో. ఇవి అప్పల్రావుడి మాటల్లా వుండటం యాదృచ్చికం కాదు. ఒకే తాడు, మొదలు పట్టుకు మాట్లాడాడు అప్పల్రావుడు, అదే తాడు శ్రీహరి పరీక్షిస్తున్నాడిప్పుడు.
దేశం అభివృద్ధి చెందిపోయింది, కోక్, పెప్సీ ల కాంపిటీషన్ లో కూల్డ్రింకుల రేటు పడిపోయింది అని ఆనంద పడిపోతున్న ఆత్యాధునికులకు అత్యవసరమైన కథ ఇది.


కథలో రచయిత పడ్డ శ్రమ కూడా తెలుస్తోంది. ఆ ప్రాంతాలు తిరిగి, "ఆంధ్రా స్టీల్సు" గేటు తీసుకు లోపలికి వెళ్ళిన వాళ్ళే ఆ కథ రాయగల్రు. ఇన్వెస్టిగేటివ్ రచనల పేరుతో జనాల్ని చావ బాదుతున్న రచయితలు ఈ రచయితనించి నేర్చుకోవాల్సింది చాలావుంది. నాదృష్టిలో ఇది నిజమయిన ఇన్వెస్టిగేటివ్ కథ. ఇన్నాళ్ళూ "ఇన్వెస్టిగెటివ్ రచన, రచయిత" అని వెటకారంగా మాత్రమే వాడేవాణ్ణి, ఇప్పుడిక జాగ్రత్తగా వుండాలి.


దేశ సరళీకృత విధానాన్ని వడకడితే కనపడే చిత్రం ఈ కథ. ప్రధానంగా, ఇందులో ఎవడిది తప్పు అని విచారించిన తీరు. చాలా సులభంగా (వేలూరి గారన్నట్టు) గుజరాత్ భూకంపాన్ని కూడా అమెరికా వాడి నెత్తిన రుద్దచ్చు. కథలో ఎక్కడా "స్వతంత్ర" ని కానీ బహుళజాతి సంస్థల్ని గానీ విలన్లు గా చూపే ప్రయత్నం చేయలేదు. అది కథని పూర్తిగా నీరస పరిచేది. దోచుకునే వాడెప్పుడూ సిద్ధంగానే వుంటాడు. వాడిగురించి మాట్లాడాల్సిన పనిలేదు. ఇందుకు సమధానం చెప్పాల్సిన వాళ్ళంతా జనం డబ్బు తీసుకుంటూ జనం కోసం కాకుండా "స్వతంత్ర" కి పనిచేసినవాళ్ళు. ఓ మూసలో పోసినట్టు సాగే రాజకీయ ధోరణులకీ, వాటికి అద్దం పట్టే కథలకి భిన్నమయిన కథ ఇది.


మరో విశేషం. ఇందులో ప్రధానమైన పాత్రలు కల్పితం కావచ్చు గానీ, కొన్ని పాత్రలు నిజ జీవితంలోనివే. ఆ యండి కల్పితం కాదు, ఆ మంత్రులూ కల్పితం కాదు. ఆ సంఘటనలూ కల్పితం కాదు. ఇలాటి కథ తెలుగులో చదివిన గుర్తు నాకు లేదు. హే రాం సినిమాలో గాంధీ నెహ్రూల మధ్య కమలహాసన్ పాత్ర నడిచినట్టు. ఓ యండమూరి కథలో ఆంధ్రానించి వెళ్ళిన క్రికెట్ ఆటగాడు కపిల్దేవ్, గవాస్కర్లతో కలిసి ఆడతాడు. కానీ అందులో ఆ పేర్లు తప్పా వాళ్ళ ప్రవర్తన గానీ ఆటగానీ నిజ జీవితాన్ని ప్రతిబింబించదు.


సురేష్ ఈ కథతో నా అభిమాన రచయితల్లో ఒకరయ్యారు. పై చెప్పిన అన్నికారణాలతో పాటు, మరో ముఖ్య కారణం... భద్రాచలం , పాల్వంచ, ఇల్లందు, కొత్తగూడెం వంటి ముఖ్యమైన ప్రాంతపు నేపథ్యంలో సరయిన కథలే లేవనే కొరత ఈ కథతో కొంత తీరినందుకు.


ఇంత మంచి కథలో కూడా నాకు కొన్ని విషయాలు రుచించలేదు.


ఓ ప్రధానమైన ప్రశ్న మిగిలిపోతుంది ఈ కథ పూర్తిగా చదివినతర్వాత. పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలు తెలియని వ్యక్తి ఈ కథ చదివితే అనుకునేది "స్వతంత్ర" అనే కంపెనీ "ఆంధ్ర స్టీలు" ని మింగేసింది అని. నిజమే! అలాంటప్పుడు "ఆంధ్రా స్టీలు" బయటవున్న "చిన్న చిన్న వర్క్ షాపులూ, ఫౌండ్రీలూ, వాళ్ళ కుటుంబాలలో వేలకొద్దీ జనాలూ... అన్నీ ఎవడో మాంత్రికుడు చెయ్యి వూపినట్టు.." ఎలా మాయ మయి పోయాయి? అంతలా హీరోషిమా గుర్తొచ్చేలా అదీనూ! "స్వతంత్ర" పనిచెయ్యటానికి కూడా మనుషులు కావాలీ, వాళ్ళకీ ఈ సదుపాయాలన్నీ కావాలి కదా?


రెండో ప్రశ్న, ఆంధ్రా స్టీలు కార్మికులని "స్వతంత్ర" ఎందుకు తీసుకోదు? నా మట్టుకు నాకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసనే అనుకుంటున్నాను. కానీ ఈ కథలో మాత్రం ఈ ప్రశ్నకి సమాధానం మృగ్యం. అలాగని, ఆ కార్మికులని స్వతంత్ర తీసుకోవటంతో సమస్య తీరిపోయిందని కూడా నా అభిప్రాయం కాదు. అలా ప్రజల సొమ్ము కైంకర్యం చేయనిచ్చిన వాళ్ళు అప్పుడు కూడా జవాబు దారులే, అందులో రాజీ లేదు.


కథనంలో కూడా కొన్ని చోట్ల మరికాస్త జాగ్రత్త పడుండొచ్చేమోనని నా అభిప్రాయం. ఆ బ్రాకెట్టులు ఎక్కడపడితే అక్కడ ఎందుకో తెలీదు. అవి నా దృష్టిలో పూర్తిగా అనవసరం. సాప్ట్ వేర్ భాషలో చెప్పాలంటే, కథ ఓ ప్రోగ్రాం లాంటిది, బ్రాకెట్టులు అందులో కామెంట్లు. కథలో అవసరమైన ముఖ్యమైన వాక్యాలని బ్రాకెట్లలో పెట్టటం మూలంగా అవి execute కావని నా భయం. ఉదాహరణకి "...అయితే మరి ఇరవయ్యేళ్ళకల్లా మొదటిది దివాళా తీసింది..." అన్న వాక్యం.


పాత్రల పరిచయం చేసిన తీరుకూడా. ఈ కథలో ప్రధాన మైన సమస్య ఇందులో ఉన్న పాత్రల సంఖ్య. చెప్తున్న కథకి అన్ని స్థాయిలలో ఉన్న పాత్రల అవసరం వుంది, నిజమే. కానీ పరిచయం చేసేటప్పుడు మొదటి పేజీలో, మూడు లైన్ల వ్యవధిలో అయిదు పాత్రల్ని (జీపులో) పరిచయం చేస్తే పాఠకుడికి కష్టమవచ్చు. ఒకేసారి పది పాత్రల్ని సృష్టిస్తే ఎవరెవరో ఎలా గుర్తుపెట్టుకునేది? పాఠకుడు కథ మొదలు పెట్టినప్పుడు కొత్త కాలేజీ, కొత్త క్లాసులో చేరినట్టుగా ఫీల్ అవుతాడు. క్లాసులో 25 కొత్త మొఖాలూ, 25 కొత్త పేర్లూ, వాళ్ళ వాళ్ళ భాషలూ, వాళ్ళ వాళ్ళ వూర్లూ అన్నీ తెలిసొచ్చి, మనకి మితృలయ్యే టప్పటికి కనీసం రెణ్ణెల్లు పడుతుంది. చేరిన రోజే అందరూ ఒక్కసారిగా మీద పడి "హల్లో" అంటే అది రాగింగ్ అవుతుంది గానీ పరిచయం కాదు. అలాగే కథ! ఓ పాత్ర పరిచయం అయ్యాక దాంతో పాఠకుడికి ఓ లింక్ ఏర్పడాలి. ఇన్ని పాత్రలున్న కథలో ఇదెలా సాధ్యమో నాకు తెలీదు, ఇంకొంచెం బాగా పరిచయం చేసే మార్గం ఉందేమో చూడమని మాత్రమే నా సూచన. (చెప్పటం బహుతేలిక సుమా!).


సాఫ్ట్ వేర్ భాషలో మళ్ళీ. నాటకం C లేదా pascal లాంటిది. పాత్రలన్నీ ముందే డిక్లేర్ చేసెయ్యాలి, "పాత్రలు" అనే హెడ్డింగు కింద. కథ C++, అంతా Object Oriented, అవసరమయినప్పుడు మాత్రమే పాత్రని construct చెయ్యాలి. నాలుగు పేరాల తర్వాత, నాలుగు సంఘటనల తర్వాత అవసరమయ్యే పాత్రని ఇప్పుడే పరిచయం చెయ్యడం అనవసరం. నా Coding standards document ఒప్పుకోదు. కథ ముందుకూ వెనక్కీ నడవటం బానే వుంటుంది. కానీ ఇన్ని పాత్రలూ ఇన్ని సంఘటనలూ ఉన్న కథలో అలా చేస్తే కొంచెం తికమక (confusion) గా వుండే ప్రమాదం వుంది.


సాఫ్ట్ వేర్ భాషలో మళ్ళీ. ఓ సంఘటన, అందులోని వ్యక్తుల గురించి చెప్ప్తున్నప్పుడు, పాఠకుడి బుర్రలో ఓ చిత్రం పెయింట్ అయ్యి వుంటుంది. అప్పుడు సడన్ గా పాఠకుణ్ణి ముందుకో వెనక్కో లాగేస్తే, పాఠకుడు ఆ చిత్రాన్ని పక్కకి జరిపి (page fault) కొత్త చిత్రాన్ని పెయింట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది అవసరం, ముఖ్యంగా ఈ రెండు చిత్రాల్నీ బేరీజు వేసి చెప్పాల్సి వచ్చినప్పుడు. కానీ పదే పదే ముందుకీ వెనక్కీ ఉయ్యాల వూపితే పాఠకుడికి చాలా శ్రమ. (ఫాఠకుడి బుర్రచేత exercise చేయిస్తానన్న రచయితకి క్రితం తానా ప్రైజు వచ్చింది, ఇంక అక్కడితో చాలు. అందరూ ఆ దార్లో వెళ్ళక్ఖర్లా!)


చివరిగా నాకు కొన్ని వాక్యాలు నచ్చలేదు. "కాగితాన్ని కిందకీ పైకీ శల్య పరీక్ష..." చెయ్యడం అని అనొచ్చా? నాకెందుకో అలా వాడడం సబబు కాదనిపిస్తోంది. నాకు తెలిసినంత వరకూ మనుషులకి మాత్రమే వాడతాం శల్యపరీక్ష అని. ఇది నా తెలియని తనం అయ్యుండొచ్చు కానీ, కాగితానికైతే "నిశితంగా పరిశీలించడం" అని రాయడం బాగుంటుందనుకుంటా. ఎవరైనా పెద్దవాళ్ళు చెపితే ఈ విషయంలో నేను వాదించకుండా బుద్ధిగా వింటాను. మరో రకంగా అలోచిస్తే, మనిషి మాటకన్నా ఆ కాగితం ముక్కకే ప్రధానమని, మనిషిని కూడా కాయితాల్లోనే చూడటం నేర్చుకున్నాము అని రచయిత smart గా చెప్పడానికి అలా వాడాడంటే, సరే. "ఆయనకి పాపం డబ్బు చేసింది" అన్న ముళ్ళపూడి మాటలా.


అలాగే జలీల్, సనాల సంభాషణలో "మిలియనీర్" అనే పదం రావడం నప్పలేదు. అది ఇంజనీర్ల మధ్య అయితె సరే గానీ జలీల్, సనాలకి సరిపడదు. ఆ ప్రాతంలో ఆ పాత్రలకి వాడదగిన పదం "షావుకారు". "ఈని తండల ఈడే సావుకారన్నట్టు" అంటే బాగుండేది.


పైన చాలా వరకూ నా అభిరుచి (Taste) కి సంబంధించిన విషయాల్లానే తోస్తోంది. పరిచయంలేని రచయితే గనక ఈ కథ రాసుంటే, మొదటి ప్రశ్ననీ, పాత్ర చిత్రణనుగురించిన నా శంశయాన్నీ మాత్రమే స్పృశించి వదిలేశేవాణ్ణి బహుశా. -


-అక్కిరాజు భట్టిప్రోలు

రిసైకిల్ : అస్థిత్వానికి అటూ ఇటూ గురించి

చాలా కాలం క్రితం నించీ నేను అంతర్జాలం లో అవీ ఇవీ రాస్తున్నాను. కథలు రాయటం కొత్త వ్యసనమయితే, ఇంటర్నెట్ లో జనాల్ని విసిగించడం దాదాపు పది పన్నెండేళ్ళనించీ నిరవధికంగా సాగుతూనే ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని బానే రాశాననీ అనిపిస్తుంది... కొన్ని నాకే నా అప్పటి అమాయకత్వం మీద జాలి కలుగుతుంది. ఒకటి మాత్రం నిజం... కథలు రాయటానికి ముందు నేను మరింత ఎక్కవగా నోరు (పోనీ కీ బోర్డు) పారేసుకునేవాణ్ణి. అలాటి అప్పటి రాతల్లోంచి నాకు దాచుకోవాలనిపించిన వాటిని మెల్లిగా నా బ్లాగు లోకి చేరుద్దామనుకుంటున్నాను.

నేను ఈ మధ్య రాసిని "కొత్త కథకుల కష్టాలు" అన్న వ్యాసం రాశాక నేను ఏకథనీ ఉదహరించకుండా పైపైన రాశానని కొందరన్నారు. పూర్వాశ్రమంలో ఒకటి రెండు కథల మీద నా అనాలిసిస్ రాశాను. వాటిని మళ్ళీ ఇక్కడ వేద్దామనుకుంటున్నాను.
________________________________________
కథ : అస్తిత్వానికి అటూ ఇటూ (తానా బహుమతి పొందిన కథ)
రచయిత : మధురాంతకం నరేంద్ర
కథ ప్రచురణ కాలం : జులై 2001
నా అనాలిసిస్ రాసిన కాలం : అగస్టు 2002
నా ఒరిజినల్ పోస్టు దాని అనుబంధ చర్చ ఇక్కడ.


ఇక నా పైత్యం :
అస్థిత్వానికి అటూ ఇటూ చదివినప్పుడు ఓ అభిప్రాయం ఏర్పరచుకుని, రచయిత చెప్పదల్చుకున్నది ఇదీ అని ఓ నిర్ణయానికి వచ్చాను. కానీ అలా అనుకుని వెనుతిరిగే లోపులో ఈ కథమీద రివ్యూలు రావటం మొదలు పెట్టాయి. కానీ ఏ రివ్యూలోనూ నేనకున్నట్టుగా ఈ కథని ప్రస్తావించకపోవడం నాకాశ్చర్యం వేసింది. అందుకని ఈ కథని నేనెలా అర్థం చేసుకున్నానో అందరికీ చెప్పే ప్రయత్నం ఇది.

ముందుగా ఓ ప్రశ్న. మనిషి మారడం అంటే ఏమిటి

సినిమా ఫక్కీలో విలన్ గారు ఆఖరిసీన్లో "నన్ను క్షమించమ్మా.... నేను మారాను" అని హీరోయిన్ కూతురుతో చెప్పి చేతికి బేడీలతో జీప్ ఎక్కి జైలు కెళ్ళిపోవడం లాంటి జోకులు కాదు నేను మాట్లాడుతున్నది!

తాను మనసా, వాచా నమ్మిన ఓ ఆలోచనని, సిద్ధాంతాన్ని, పంథాని... తన ఆలోచనలతోటి, "హేతువు" తోటి నిర్మించుకున్న తనదైన వ్యక్తిత్వానికి ఎదురువాదం ఒకటి వచ్చినప్పుడు, దానికి ఎదురు నిలిచే, ఎదురొడ్డే సమాధానం తన దగ్గర లేనప్పుడు, ఆ మనిషిలో సంచలనం కలగొచ్చు. దానికి ప్రతిగా వ్యక్తి తన "వ్యక్తిత్వాన్ని" తన "నమ్మకాన్ని" మార్చుకోవాల్సి రావచ్చు, మార్చు కోవచ్చు... నిజంగా ఆ మెచ్యూరిటీ, హుందాతనం ఆ మనిషిలో ఉంటే. ఎంతో మంది తత్వవేత్తలు కూడా ఇలా ముందుకూ వెనక్కీ లాగి పీకి తాము చెప్పినవాటికి తామే కాలక్రమంలో మార్పులూ చేర్పులూ చేశారని విని వున్నాం. ఇదీ మనిషి మారటం అంటే!

మరో రకం ఉంది. దీన్ని కూడా "మారటం" అనే అంటారేమో? అనొచ్చేమో? అలా అనొచ్చంటే, బహుశా నేనిది రాయక్కర్లేదనుకుంటాను!

చిన్నప్పుడు అమ్మ నేర్పించిందని నిద్దర్లేవంగానే ఎడంచేత్తో బ్రష్షు పట్టుకుని కుడి చేత్తో దాని మీద పేస్టు వేసుకుంటాం! ఓ ఎడమ చేతి వాటం గాడికి ఎప్పుడో పొరపాటున రివర్స్ చేసి చూసిందాకా... తానింతకాలం చేసింది తనకు నచ్చిన, సులువైన పని కాదనీ, అందుకు విరుద్ధమైన పనే నిజానికి తనకి తగిన పనీ అని గ్రహించ లేక పోవచ్చు! అది గ్రహించడం ఆ మనిషిలో మార్పు అని నేననలేను.

అదేరకంగా దేవుణ్ణో, మరో సిద్ధాంతాన్నో నమ్మటం, నమ్మక పోవటం కూడా. ఎవరో ఒకాయన అన్నాడు, ప్రపంచంలో 90% మంది భక్తుల 90% భక్తి, 90% మంది నాస్థికుల 90% నాస్థికత్వం రెండూ అబద్ధమే అని. అంకెల్లోకీ, ఈ విషయంలో నిజా నిజాల్లోకీ వెళ్ళద్దు గానీ, ఇందులో ఓ ముఖ్యమైన ప్రశ్న ఉంది.

ఎంతమంది ఆస్థికులు దేవుణ్ణి నమ్మటానికి, క్రతువులూ గట్రా చెయ్యడానికి తమకంటూ ఓ రీజనింగ్ ని ఏర్పరచుకుని వున్నారు? అలాగే, అలాంటి ప్రశ్నే నాస్థికులని కూడ అడగొచ్చు. చిన్నప్పట్నించీ చుట్టూతా వున్న పెంపకం వాతావరణం ప్రకారం అలా గుడ్డిగా చేసుకు పోవటమే తప్పా, సొంతంగా కూర్చుని ఆలోచించుకునే తత్వం ఎందరికి ఉంటుంది? ఎన్ని విషయాల్లో ఉంటుంది? తరచి చూసుకుంటే అందరిలోనూ ఇలా తెలియకుండా జీవితంలో రొటీన్ అయిపోయినవి, ఆలోచించకుండా ఆచరించుకుంటూ వస్తున్నవి ఉంటాయి అని నా భావన. అది చిన్న విషయాలనించి పెద్ద విషయాల దాకా! మనం నమ్ముతున్నామనుకుంటున్న కొన్ని నమ్మకాలతో సహా! "మడి కట్టుకో", "బొట్టు అడ్డంగా పెట్టుకో", "క్రాసు మెళ్ళో వేసుకో", "ముక్కు మీద చెయ్యి పెట్టుకో", "పిడికిలి బిగించు", "ముక్కు మీద చెయ్యి తియ్యకుండానే మమ అనుకో", "బిగించిన పిడికిలి గాల్లో ఊపి లాల్ సలాం అని అరువు"... ఇలాంటి వన్నీ కూడా.

మనిషి తనని తాను తన మేధస్సు తోటీ, హేతువు తోటీ తరచి చూసు కోకుండా చుట్టూతా వున్న వాతావరణాన్ని యథాతథంగా అనుసరించడం వల్లా, అలా అనుసరించేటట్టు అతగాణ్ణి తయారు చేయడం వల్లా వచ్చే స్థితి ఇది.

ఆ మనిషి ఆ వాతావరణం నించి బయట పడ్డమో, లేదా తనకి తాను సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి ఎదురయినప్పుడో అకస్మాత్తుగా తనకి తెలిసి వస్తుంది. తానింత కాలం ఆచరించిందీ, నమ్మిందీ తన ప్రవృత్తే కాదని. ఇలా జరగటం మనిషి మారడం కాదు, తనని తాను తెలుసు కోవడం!

నరేంద్ర గారి కథలో నా కదే కనపడింది. ఒకే ఒక్క సంఘటన, అదెంత బలమయినదయినా సరే ఓ ఆస్థికుడు నాస్థికుడు గానూ, ఓ నాస్థికుడు ఆస్థికుడు గానూ మారతాడంటే నేన్నమ్మను.... ఇందాకటి సినిమా విలన్ మళ్ళీ గుర్తొస్తాడు!

నేనీ కథని రెండు పాత్రల (సంజీవి, జానీ) కోసం విడి విడి గా చదివాను, ఒక్కళ్ళమీదే ఫోకస్ చేస్తూ. సంజీవి ఎక్కడా తాను వైదిక కర్మల్ని లోతుగా నమ్మేస్తున్నట్టుగాను, అందుకు తనకంటూ ఉన్న కారణాలను గానీ వివరించలేదు. అది అతగాడు కావాలని ఏర్పరచుకున్న వ్యక్తిత్వం కాదు. వాళ్ళమ్మ తనని నిష్టగా పెంచిందిట, ఇతగాడు భక్తితో, నిష్టతో అన్నీ నిర్వర్తించాడుట... అందుకని ఏ అపకారం జరక్కూడదుట! నిజంగా స్వతహాగా అంత భక్తి ఉన్న వాడయ్యుంటే ఏదో అపచారం జరిగుంటుందని మళ్ళీ శాస్త్రి గారిని చూడ్డానికి వెళ్ళుండే వాడు. అంతేగానీ అకస్మాత్తుగా నాస్థికుడయిపోడు.

కథంతా జాగ్రత్తగా చూడండి. ఆచారాలకీ, వ్యవహారాలకీ జరిగిన "ఎమెండ్మెంట్ల" గురించిన మాటొచ్చినా, ఆ పేరుతో జరుగుతున్న వ్యాపారాల గురించిన సంభాషణ అయినా దీని గురించిన బాధ, ఆసక్తీ జానీ లోనే ఎక్కువ కనపడతాయి. వీటి పట్ల ఓ అవగాహనా ఓ ఇతమిథమయినా ఆలోచన ఏర్పరచు కున్నవాడే అయితే సంజీవి ఆ సంభాషణల్ని అలా తుంచేయడం గానీ, ఆసక్తి చూపించకుండా ఉండడం గానీ చెయ్యడు. జానీ నిజంగా అంతటి నాస్థికుడే అయితే ఆ జరిగే వ్యవాహారాల్లో అంతకగా బాధపడి పోవాల్సిన పనిలేదు. సంజీవి ఏదో రకంగా పని చేసుకుపోదాం అని చూస్తుంటే, జానీ ఏమో ప్రతి దాన్నీ తరచి చూస్తున్నాడు.. ఎందుకని?

అంచేత, సంజీవి, జానీలలో వచ్చింది మార్పు కాదు. వాళ్ళు నమ్ముతున్నామనుకున్న నమ్మకాలనించి వాళ్ళకి విముక్తి దొరికింది. అసలు ఇదీ నేను నమ్ముతున్నది, ఇన్నాళ్ళూ ఎలా తెలుసుకోలేక పోయాను అనుకున్నది అంతే!

బాల్యంలో ఆలోచించడం, ప్రశ్నించడం నేర్చుకుంటున్న సమయంలో స్వంతంగా వ్యక్తిత్వాన్నీ ఏర్పరచుకునే అవకాశం లేకుండా , నెత్తిమీద భక్తి, ఆచారం, సిద్ధాంతం అంటూ ప్రశ్నించే అవకాశం కూడ ఇవ్వకుండా రుద్దేస్తే తయారయే అర కొర వ్యక్తులకీ, వ్యక్తిత్వాలకీ ప్రతీకలు ఈ పాత్రలు రెండూ, జానీ, సంజీవిలు.

- అక్కిరాజు భట్టిప్రోలు

Monday, April 30, 2007

శ్రీకారం

ఒకప్పుడు గుండెకాయ, తలకాయ కవలల్లా ఒకే సైజు లో ఉండి ఒకే మాట మాట్లాడేవి. ఏ సమస్యా ఉండేది కాదు. కాలం గడిచిన కొద్దీ ఒక్కోటీ ఒక్కో కోణంలో పెరిగి (?) పోయి నేనంటే నేనని విసిగిస్తున్నాయి. మనిషికి మనసే కాదు, అర కొర మెదడు కూడా తీరని శిక్షే!! కథలు రాయటం మొదలు పెట్టినా ఇద్దరు బాసుల్లో ఎవరో ఒకరు మొహం మాడ్చుకోవటమే తప్పా కలిసి కంగ్రాట్స్ చెప్పింది లేదు. ఎన్నో ఆలొచనలు వీళ్ళిద్దర్లో ఎవరో ఒకరికి నచ్చక నాలోనే మిగిలి పోతున్నాయి. ఇలా పూర్తిగా ఓ రూపు తెచ్చుకోని ఆలోచనల్ని నలుగురితో పంచుకోవటానికే ఈ బ్లాగు.

నా మొదటి కథ మూడు బీర్ల తరవాత. ఇదసలు కథా కాదా అనే ప్రశ్న కూడా వేశారు అప్పట్లో. అది కథ అయినా కాక పోయినా కథ అని ప్రచురించబడిన నా మొదటి రచన. తన కేమి కావాలో తనకే తెలీని సందిగ్ధంలో ఉన్న ఓ మనిషి తిక్క వాగుణ్ణి రికార్డు చేసే ప్రయత్నం ఆ కథ. మదికీ, మేధకీ మధ్య లింకు తెగ్గొట్టేస్తే మనిషి వింత పశువే. ఆ లింకు తెగ్గొట్ట డానికి వాడిన ట్రిక్ మూడు బీర్లు! అందుకే అదే పేరు ఈ బ్లాగుకి సరిపోతుందనిపించింది!

కొన్ని కొన్ని సార్లు మనం చిన్నప్పట్నించీ మెదిలే కొన్ని భావాలకి అకస్మాత్తుగా ఓ కొత్త పుస్తకం చదవటం మూలంగానో, ఎవరితోనో మాట్లాడ్డం మూలంగానో సమాధానం దొరుకుతుంది. అలాటిదే ఇటీవల నేను చదివిన పుస్తకం "Emotional Intelligence (1, 2, 3)". దీన్ని మా ఆఫీసులో మానేజెమెంట్ కి అవసరమయిన పుస్తకంగా గుర్తించి చదవమన్నారు. నిజం చెప్పొద్దూ... అవసరానికి మించి ఏ మేనేజ్ మెంట్ పుస్తకాన్నీ నేను శ్రద్ధగా చదవలేను. అంతే నిరాసక్తంగా ప్రారంభించినా ఈ పుస్తకంలో నాకు కొన్ని ఊహించని సమధానాలు దొరికాయి.

(ముందుగా ఈ పుస్తకం గురించిన విమర్శలు కూడా చాలాఉన్నాయి అనిచెప్పాలి. ఇది పూర్తిగా "సైంటిఫిక్" ఏమీ కాదనీ, Fortune 500 కంపెనీల కోసమే, వారికి నచ్చేట్టుగా రాసిన పుస్తక మని కూడా విమర్శలున్నాయని పుస్తకం చదివాక అంతర్జాలం లో తెలుసు కున్నాను. అంత లోతుల్లోకి వెళ్ళేటన్ని తెలివితేటలు నాకు లేవు గానీ, ఆ పుస్తకం ఫేస్ వాల్యూ మీద ఆధారంగా మాత్రమే ఈ నా నాలుగు మాటలూను)

ఏమిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. మనకి పుట్టుకతో వచ్చేది ఎమోషనల్ మైండ్. తార్కికంగా ఆలోచించే మెదడు తయారవక ముందే ఇది తయారయి కూర్చుంటుందన్న మాట. ప్రపంచంలో ఎక్కడయినా కోపం, భయం, తాపం, విరహం, ప్రేమ లాంటి ఆవేశాలు మనిషిని కమ్మినప్పుడు శరీరంలో కలిగే భౌతిక మార్పులు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకి
కోపం : ఆయుధాలని తీసుకుని యౌద్ధానికి సిద్దమయే మార్పులు శరీరంలో కలుగుతాయి
భయం : కాళ్ళల్లో రక్త ప్రసరణ హెచ్చుతుంది. పారిపోవడానికి గానీ దాక్కోడానికి గానీ శరీరం సమాయత్త మవుతుంది
సంతోషం: చెడు ఆలోచనలన్నింటినీ తొక్కిపెట్టి, శరీరమంతా శక్తిమంతమవుతుంది... ఆ మంచిని పూర్తిగా అనుభవించి దాచుకోడానికి.
ఆశ్చర్యం : కళ్ళు పెద్దవిగా తెరుచుకుంటాయి సాధ్యమయినంత ఎక్కువ వివరాలను సేకరించ డానికి.

ఇలాగే చంటి పాపకి ఎలా తెలుసు తల్లి స్థనం నోటి దగ్గరకు రాంగానే ఏం చేయాలో?

పాతకాలపు 9 తరగతి తెలుగు మీడియం చదివిన నాలాటి వాళ్ళకి వీటిని "అసంకల్పిత ప్రతీకార చర్యలు" అనీ "క్షోభ్యత" (impulse) అనీ అంటారని తెలుసు. అయితే అవి మన మస్తిష్కాల్లోకి ఎలా వచ్చాయి?

ఎవల్యూషన్లో మనని మనం కాపాడు కోవడానికీ, మన సంతతిని వృద్ధి చేసుకోవడానికి అవసరమయిన ఈ లక్షణాలు జన్యుపరంగా మనకి సంక్రమించాయని చెప్పుకోవచ్చు.

ఆతర్వాత తీరిగ్గా మనిషి పెరుగుతున్న కొద్దీ ఆలోచించే మెదడు (neocortex) పెరుగుతుంది. కానీ సైంటిస్టులు కనిపెట్టిందేమిటంటే మన ఆవేశపు మెదడు (emotional mind) ఒక్కోసారి ఏదయినా ప్రమాదమని గుర్తిస్తే, అదే ఇతర శరీర భాగాలకి ఏంచేయాలో చెప్పేస్తుందట. ఆలోచించే మెదడు విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని సరయిన ప్రతిక్రియని తయారు చేసే లోగా జరగాల్సింది జరిగి పోతుందన్న మాట! (Emotional Hijacking).

ఇలా ఇంత పేలవ మయిన Design తో ఎందుకు మన మెదడు తయారయింది అంటే చెప్పిన కారణం, ఎవల్యూషన్ అనేది చాలా మెల్లిగా జరిగే తంతు. మిలియన్ల సంవత్సరాలుగా మన ఆవేశపు మెదడు తయారయితే అతి తక్కువ సమయంలోనే మన ఆలోచించే మెదడు తయారయిందట. ఆది మానవుడు సింహం మీద పడితే వెంటనే ఏదో చేయాలి గానీ, తీరిగ్గా ఆలోచించే సమయం లేదు. అందుకే ఆవేశపు మెదడుకు శరీరం మీద ముందునించీ అదుపు ఉండింది. ఇంకో రకంగా చెప్పాలంటే జంతువులకు ఒక్క ఆవేశపు మెదడే ఉంటుంది, ఆలోచించే మెదడు దాదాపు ఉండదు.

అందుకే, మనం గనక ఆవేశపు మెదడు మీద ఆధారపడి పని చేస్తే ఆటవిక/ఆది మానవుల్లానో, చిన్న పిల్లల్లానో, జంతువుల్లానో ప్రవర్తిస్తామన్న మాట! అందుకే ఒక్కోసారి ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరు మనకే వింతగా తోస్తుంది తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే. అవేశపు మెదడుతో అన్నీ సమస్యలే కాదు, కొన్ని సందర్భాల్లో దాని మూలంగానే బయట పడతాం కూడా! ఆ ఆవేశపు మెదడు లేక పోతే, పూర్తిగా తర్కం మీదే ఆధారపడే స్థితి వస్తే, మనకీ రోబోట్లకీ తేడా ఉండదన్నమాట!

నేనెప్పుడూ (ఈ పుస్తకం చదవక ముందునుంచీ) అనుకునే వాణ్ణి... చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు గానీ నిజానికి వాళ్ళు జంతువులతో సమానమని. ఈ పుస్తకం చదివాక అది రూఢి అయింది. మల్లిక్ చిట్టి కార్టూన్ లయినా, ముళ్ళపూడి బుడుగయినా చుట్టూతా ఉన్న Socially Accepted Behaviour కి బయటే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. నా అనుమానం పిల్లల్లో నిజానికి సహజమైన హింస కూడా దాగి ఉంటుందని. దాన్ని తగ్గించి సంస్కరించడమే వాళ్ళని జంతువులనుండి మనుషులుగా మార్చడం. (Domestication Of Emotions)

ఈ దృష్టిలో చూస్తే అన్ని మతాలూ చెప్పే టెన్ కమాండ్ మెంట్స్ లాంటి సూత్రాలన్నీ ఈ Domestication Of Emotions అనే ప్రక్రియ కోసమే నేమో? హేతు వాదం మీద అచంచలమైన విశ్వాసం ఉన్నప్పటికీ హేతువుకి లొంగని ఇన్ని రకాల నమ్మకాలు, దేవుడూ, దెయ్యమూ, మతమూ తదితరములు ప్రపంచాన్ని ఎలా గుప్పిటిలోకి తీసుకున్నాయో అంటే ఇలా అర్థం చేసుకోవాలా?

ఈ సందర్బంలోనే న్యూయార్క్ టైంస్ లో మతాన్ని శాస్త్రీయంగా (scientific) ఎలా అర్థం చేసుకోవాలీ అన్న దాని మీద ఓ ఆర్టికల్ Darwin's God వచ్చింది. డార్విన్ సిద్దాంతం ప్రకారం ఏ జంతువయినా తన సంతతి వృద్ధి పొందే మార్గంలో (survival) తన ప్రవర్తనని రూపొందించుకుని భావి తరాలకు అందిస్తుంటుంది. మరి ఈ ఎవల్యూషన్ సూత్రంలో మతాన్ని ఎలా అర్థం చేసుకోవటం?
ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ నమ్మటం (Faith) సర్వైవల్ కి ఎదురు నిలుస్తుంది (counter productive) కానీ సహాయం చెయ్యదు కదా! నిజానికీ అబద్ధానికీ మధ్య అంతరం చావునో బతుకునో నిర్ధారిస్తుంది అడవిలో. అక్కడ సింహం ఉంటే ఉంది లేక పోతే లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు, లేని దాన్ని లేనట్టు మాత్రమే నమ్మి ప్రతిక్రియ ఏర్పరచు కోవాలి అక్కడ. ఇక్కడ నమ్మకం (Faith) అన్న దానికి చోటేలేదు. అంచేత survival అనే ఒక్క సూత్రంతో మనిషి మతాన్ని, దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాడో చెప్పలేం!

కాకపోతే పైన చెప్పిన survival అనేది జంతు రాజ్యంలో, అనాగరిక రాజ్యంలో. ఆ రాజ్యంలోంచి ఒక్క సారిగా బయట పడి ఇన్ని తెలివి తేటలుసంపాయించు కున్న మనిషి ఆ జంతు survival instincts లోంచి బయట పడ్డానికే, ఆ ఆవేశపు మెదణ్ణి కాస్త ప్రలోభ పెట్టి, తర్కాన్ని పీఠ మెక్కించడానికి కాస్త మత్తు మందు కావాలి... ఆ మందుకే మతమనీ, ఆచారమనీ, సాంఘిక కట్టుబాట్లనీ ఇన్ని పేర్లు!

ఇంత కాంట్రడిక్షన్ నేను ఇంతకు ముందు వినలా. హేతువుని పీఠమెక్కించడానికి మతం కావాల్సొచ్చిందని తేల్చాం!

అందుకే నాకున్న మరో ప్రశ్న, మనిషి కాకుండా వేరే ఏ జంతువయినా దేవుణ్ణి నమ్ముతుందా అని. అంటే మన శ్రీకాళహస్తి కథలో కనపడే ఏనుగూ, సాలె పురుగూ, పామూ నిజంగా ఉండే అవకాశం ఉందా అని! ఈ పుస్తకమూ, ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నా కనిపించేది... అది సాధ్యం కాదు అని! జంతువులకు Domestication Of Emotions అనేది ప్రమాదం.... మనిషికి అవసరం!

ఇంత ఆలోచించాక అప్పుడు నేను రాసిన మూడు బీర్ల తర్వాత కథ నాకే కొత్తగా అర్థమయింది. నేను చేసిందల్లా ఆ మనిషిలోని ఆలోచనల మెదడికి విశ్రాంతి నిచ్చి, వాడి ఆవేశాలకి పట్టం గట్టి... ఓ జంతువుని సభ్యసమాజం లోకి వదిలి చోద్యం చూశా!

ఇప్పుడదే పని నాకు చేయాల్నుంది ఇక్కడ! అందుకే... ఆ మూడో బీరు కావాలి.... ఎవరక్కడ!!

అక్కిరాజు భట్టిప్రోలు