Wednesday, May 2, 2007

రిసైకిల్ : టైటానికి కథ గురించి

కథ : టైటానిక్ (తానా బహుమతి పొందిన కథ)
రచయిత : సురేష్
కథ ప్రచురణ కాలం : జులై 2001
నా అనాలిసిస్ రాసిన కాలం : జులై 2001
నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2)
__________________________________________


"....యేరుశనగ మిరపల వర్తకాల్లో కొందరిని జంక్సను కాడ మిల్లులు, మరికొందర్ని టేశను కాడ మిల్లులు - పెద్ద వర్తకులు - యీలకన్న లోకం సూసినోల్లు - యీల్లను ముంచీసినారు. అయితే ఆ మిల్లులన్న ఇప్పుడున్నాయా? ఆట్నన్నింటిని అంతకన్న పెద్దమిల్లులు ఆవదాలవలసవి మింగీసినాయి. మరి అవైన వుంటాయా? నాకు తెల్దు గాని ఆట్ని కూడ మింగుతున్నవీ, మింగబోయేవీ ఎక్కడో ఏవో పుట్టి పెరుగుతూనే వుంటాయి...." అంటాడు అప్పల్రావుడు యజ్ఞం కథలో.


అప్పల్రావుడి వుపన్యాసంలో తనకి తండ్రి దగ్గర్నించి వచ్చిన రెండు తులాల బంగారం, యీసిన్నర యెండి, కొంత భూమి ఎలా న్యాయబద్ధంగా చేతులు మారాయో చెపుతాడు. 1964 లో రాసిన కథ యజ్ఞం. ఆముదాలవలస మిల్లుదాకా చూడగలుగుతాడు అప్పల్రావుడు. మరాతర్వాత ఏంజరిగింది? అతగాడి ఆ ఆస్థి ఇన్నేళ్ళ తర్వాత కొత్త శతాబ్దిలోనైనా దారి మార్చి వెనక్కి వచ్చే సూచనలేమైనా కనపడుతున్నాయా? కనీసం ఏ సరిహద్దుదగ్గరన్నా చేరి స్థిరపడిందా? లేదూ, ఉన్న సరిహద్దుల్ని కూడా దాటేసి కొత్త తీరాలకి చేరుతోందా? దానికి సమాధానమే టైటానిక్ కథ. అప్పల్రావుడు చెప్పినట్టుగా ఆ " చిన చేపని పెద చేప, చిన మాయను పెను మాయ " కథ నడుస్తూనే వుంది, విసుగూ విరామం లేకుండా.


"... ఎవరి పరిస్థితి బాగుందని? స్వతంత్రని వదిలేశాక నాకు మాదాపూర్ లో జాబొచ్చింది. రెండేళ్ళు బానే గడిచాక ఇవాళ పొద్దున మాకంపెనీ బోర్డు మారిపోయింది. రాత్రే శాంస్ ఇంక్ వాళ్ళు మా సాఫ్ట్ వేర్ కంపెనీని వోవర్ టేక్ చేశారు. ఇక్కడి కంటే చైనాలో బెటరని హైదరాబాదు కంపెనీని మూసేశారు ..." ఇవి శ్రీహరి మాటలు, టైటానిక్ లో. ఇవి అప్పల్రావుడి మాటల్లా వుండటం యాదృచ్చికం కాదు. ఒకే తాడు, మొదలు పట్టుకు మాట్లాడాడు అప్పల్రావుడు, అదే తాడు శ్రీహరి పరీక్షిస్తున్నాడిప్పుడు.
దేశం అభివృద్ధి చెందిపోయింది, కోక్, పెప్సీ ల కాంపిటీషన్ లో కూల్డ్రింకుల రేటు పడిపోయింది అని ఆనంద పడిపోతున్న ఆత్యాధునికులకు అత్యవసరమైన కథ ఇది.


కథలో రచయిత పడ్డ శ్రమ కూడా తెలుస్తోంది. ఆ ప్రాంతాలు తిరిగి, "ఆంధ్రా స్టీల్సు" గేటు తీసుకు లోపలికి వెళ్ళిన వాళ్ళే ఆ కథ రాయగల్రు. ఇన్వెస్టిగేటివ్ రచనల పేరుతో జనాల్ని చావ బాదుతున్న రచయితలు ఈ రచయితనించి నేర్చుకోవాల్సింది చాలావుంది. నాదృష్టిలో ఇది నిజమయిన ఇన్వెస్టిగేటివ్ కథ. ఇన్నాళ్ళూ "ఇన్వెస్టిగెటివ్ రచన, రచయిత" అని వెటకారంగా మాత్రమే వాడేవాణ్ణి, ఇప్పుడిక జాగ్రత్తగా వుండాలి.


దేశ సరళీకృత విధానాన్ని వడకడితే కనపడే చిత్రం ఈ కథ. ప్రధానంగా, ఇందులో ఎవడిది తప్పు అని విచారించిన తీరు. చాలా సులభంగా (వేలూరి గారన్నట్టు) గుజరాత్ భూకంపాన్ని కూడా అమెరికా వాడి నెత్తిన రుద్దచ్చు. కథలో ఎక్కడా "స్వతంత్ర" ని కానీ బహుళజాతి సంస్థల్ని గానీ విలన్లు గా చూపే ప్రయత్నం చేయలేదు. అది కథని పూర్తిగా నీరస పరిచేది. దోచుకునే వాడెప్పుడూ సిద్ధంగానే వుంటాడు. వాడిగురించి మాట్లాడాల్సిన పనిలేదు. ఇందుకు సమధానం చెప్పాల్సిన వాళ్ళంతా జనం డబ్బు తీసుకుంటూ జనం కోసం కాకుండా "స్వతంత్ర" కి పనిచేసినవాళ్ళు. ఓ మూసలో పోసినట్టు సాగే రాజకీయ ధోరణులకీ, వాటికి అద్దం పట్టే కథలకి భిన్నమయిన కథ ఇది.


మరో విశేషం. ఇందులో ప్రధానమైన పాత్రలు కల్పితం కావచ్చు గానీ, కొన్ని పాత్రలు నిజ జీవితంలోనివే. ఆ యండి కల్పితం కాదు, ఆ మంత్రులూ కల్పితం కాదు. ఆ సంఘటనలూ కల్పితం కాదు. ఇలాటి కథ తెలుగులో చదివిన గుర్తు నాకు లేదు. హే రాం సినిమాలో గాంధీ నెహ్రూల మధ్య కమలహాసన్ పాత్ర నడిచినట్టు. ఓ యండమూరి కథలో ఆంధ్రానించి వెళ్ళిన క్రికెట్ ఆటగాడు కపిల్దేవ్, గవాస్కర్లతో కలిసి ఆడతాడు. కానీ అందులో ఆ పేర్లు తప్పా వాళ్ళ ప్రవర్తన గానీ ఆటగానీ నిజ జీవితాన్ని ప్రతిబింబించదు.


సురేష్ ఈ కథతో నా అభిమాన రచయితల్లో ఒకరయ్యారు. పై చెప్పిన అన్నికారణాలతో పాటు, మరో ముఖ్య కారణం... భద్రాచలం , పాల్వంచ, ఇల్లందు, కొత్తగూడెం వంటి ముఖ్యమైన ప్రాంతపు నేపథ్యంలో సరయిన కథలే లేవనే కొరత ఈ కథతో కొంత తీరినందుకు.


ఇంత మంచి కథలో కూడా నాకు కొన్ని విషయాలు రుచించలేదు.


ఓ ప్రధానమైన ప్రశ్న మిగిలిపోతుంది ఈ కథ పూర్తిగా చదివినతర్వాత. పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలు తెలియని వ్యక్తి ఈ కథ చదివితే అనుకునేది "స్వతంత్ర" అనే కంపెనీ "ఆంధ్ర స్టీలు" ని మింగేసింది అని. నిజమే! అలాంటప్పుడు "ఆంధ్రా స్టీలు" బయటవున్న "చిన్న చిన్న వర్క్ షాపులూ, ఫౌండ్రీలూ, వాళ్ళ కుటుంబాలలో వేలకొద్దీ జనాలూ... అన్నీ ఎవడో మాంత్రికుడు చెయ్యి వూపినట్టు.." ఎలా మాయ మయి పోయాయి? అంతలా హీరోషిమా గుర్తొచ్చేలా అదీనూ! "స్వతంత్ర" పనిచెయ్యటానికి కూడా మనుషులు కావాలీ, వాళ్ళకీ ఈ సదుపాయాలన్నీ కావాలి కదా?


రెండో ప్రశ్న, ఆంధ్రా స్టీలు కార్మికులని "స్వతంత్ర" ఎందుకు తీసుకోదు? నా మట్టుకు నాకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసనే అనుకుంటున్నాను. కానీ ఈ కథలో మాత్రం ఈ ప్రశ్నకి సమాధానం మృగ్యం. అలాగని, ఆ కార్మికులని స్వతంత్ర తీసుకోవటంతో సమస్య తీరిపోయిందని కూడా నా అభిప్రాయం కాదు. అలా ప్రజల సొమ్ము కైంకర్యం చేయనిచ్చిన వాళ్ళు అప్పుడు కూడా జవాబు దారులే, అందులో రాజీ లేదు.


కథనంలో కూడా కొన్ని చోట్ల మరికాస్త జాగ్రత్త పడుండొచ్చేమోనని నా అభిప్రాయం. ఆ బ్రాకెట్టులు ఎక్కడపడితే అక్కడ ఎందుకో తెలీదు. అవి నా దృష్టిలో పూర్తిగా అనవసరం. సాప్ట్ వేర్ భాషలో చెప్పాలంటే, కథ ఓ ప్రోగ్రాం లాంటిది, బ్రాకెట్టులు అందులో కామెంట్లు. కథలో అవసరమైన ముఖ్యమైన వాక్యాలని బ్రాకెట్లలో పెట్టటం మూలంగా అవి execute కావని నా భయం. ఉదాహరణకి "...అయితే మరి ఇరవయ్యేళ్ళకల్లా మొదటిది దివాళా తీసింది..." అన్న వాక్యం.


పాత్రల పరిచయం చేసిన తీరుకూడా. ఈ కథలో ప్రధాన మైన సమస్య ఇందులో ఉన్న పాత్రల సంఖ్య. చెప్తున్న కథకి అన్ని స్థాయిలలో ఉన్న పాత్రల అవసరం వుంది, నిజమే. కానీ పరిచయం చేసేటప్పుడు మొదటి పేజీలో, మూడు లైన్ల వ్యవధిలో అయిదు పాత్రల్ని (జీపులో) పరిచయం చేస్తే పాఠకుడికి కష్టమవచ్చు. ఒకేసారి పది పాత్రల్ని సృష్టిస్తే ఎవరెవరో ఎలా గుర్తుపెట్టుకునేది? పాఠకుడు కథ మొదలు పెట్టినప్పుడు కొత్త కాలేజీ, కొత్త క్లాసులో చేరినట్టుగా ఫీల్ అవుతాడు. క్లాసులో 25 కొత్త మొఖాలూ, 25 కొత్త పేర్లూ, వాళ్ళ వాళ్ళ భాషలూ, వాళ్ళ వాళ్ళ వూర్లూ అన్నీ తెలిసొచ్చి, మనకి మితృలయ్యే టప్పటికి కనీసం రెణ్ణెల్లు పడుతుంది. చేరిన రోజే అందరూ ఒక్కసారిగా మీద పడి "హల్లో" అంటే అది రాగింగ్ అవుతుంది గానీ పరిచయం కాదు. అలాగే కథ! ఓ పాత్ర పరిచయం అయ్యాక దాంతో పాఠకుడికి ఓ లింక్ ఏర్పడాలి. ఇన్ని పాత్రలున్న కథలో ఇదెలా సాధ్యమో నాకు తెలీదు, ఇంకొంచెం బాగా పరిచయం చేసే మార్గం ఉందేమో చూడమని మాత్రమే నా సూచన. (చెప్పటం బహుతేలిక సుమా!).


సాఫ్ట్ వేర్ భాషలో మళ్ళీ. నాటకం C లేదా pascal లాంటిది. పాత్రలన్నీ ముందే డిక్లేర్ చేసెయ్యాలి, "పాత్రలు" అనే హెడ్డింగు కింద. కథ C++, అంతా Object Oriented, అవసరమయినప్పుడు మాత్రమే పాత్రని construct చెయ్యాలి. నాలుగు పేరాల తర్వాత, నాలుగు సంఘటనల తర్వాత అవసరమయ్యే పాత్రని ఇప్పుడే పరిచయం చెయ్యడం అనవసరం. నా Coding standards document ఒప్పుకోదు. కథ ముందుకూ వెనక్కీ నడవటం బానే వుంటుంది. కానీ ఇన్ని పాత్రలూ ఇన్ని సంఘటనలూ ఉన్న కథలో అలా చేస్తే కొంచెం తికమక (confusion) గా వుండే ప్రమాదం వుంది.


సాఫ్ట్ వేర్ భాషలో మళ్ళీ. ఓ సంఘటన, అందులోని వ్యక్తుల గురించి చెప్ప్తున్నప్పుడు, పాఠకుడి బుర్రలో ఓ చిత్రం పెయింట్ అయ్యి వుంటుంది. అప్పుడు సడన్ గా పాఠకుణ్ణి ముందుకో వెనక్కో లాగేస్తే, పాఠకుడు ఆ చిత్రాన్ని పక్కకి జరిపి (page fault) కొత్త చిత్రాన్ని పెయింట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది అవసరం, ముఖ్యంగా ఈ రెండు చిత్రాల్నీ బేరీజు వేసి చెప్పాల్సి వచ్చినప్పుడు. కానీ పదే పదే ముందుకీ వెనక్కీ ఉయ్యాల వూపితే పాఠకుడికి చాలా శ్రమ. (ఫాఠకుడి బుర్రచేత exercise చేయిస్తానన్న రచయితకి క్రితం తానా ప్రైజు వచ్చింది, ఇంక అక్కడితో చాలు. అందరూ ఆ దార్లో వెళ్ళక్ఖర్లా!)


చివరిగా నాకు కొన్ని వాక్యాలు నచ్చలేదు. "కాగితాన్ని కిందకీ పైకీ శల్య పరీక్ష..." చెయ్యడం అని అనొచ్చా? నాకెందుకో అలా వాడడం సబబు కాదనిపిస్తోంది. నాకు తెలిసినంత వరకూ మనుషులకి మాత్రమే వాడతాం శల్యపరీక్ష అని. ఇది నా తెలియని తనం అయ్యుండొచ్చు కానీ, కాగితానికైతే "నిశితంగా పరిశీలించడం" అని రాయడం బాగుంటుందనుకుంటా. ఎవరైనా పెద్దవాళ్ళు చెపితే ఈ విషయంలో నేను వాదించకుండా బుద్ధిగా వింటాను. మరో రకంగా అలోచిస్తే, మనిషి మాటకన్నా ఆ కాగితం ముక్కకే ప్రధానమని, మనిషిని కూడా కాయితాల్లోనే చూడటం నేర్చుకున్నాము అని రచయిత smart గా చెప్పడానికి అలా వాడాడంటే, సరే. "ఆయనకి పాపం డబ్బు చేసింది" అన్న ముళ్ళపూడి మాటలా.


అలాగే జలీల్, సనాల సంభాషణలో "మిలియనీర్" అనే పదం రావడం నప్పలేదు. అది ఇంజనీర్ల మధ్య అయితె సరే గానీ జలీల్, సనాలకి సరిపడదు. ఆ ప్రాతంలో ఆ పాత్రలకి వాడదగిన పదం "షావుకారు". "ఈని తండల ఈడే సావుకారన్నట్టు" అంటే బాగుండేది.


పైన చాలా వరకూ నా అభిరుచి (Taste) కి సంబంధించిన విషయాల్లానే తోస్తోంది. పరిచయంలేని రచయితే గనక ఈ కథ రాసుంటే, మొదటి ప్రశ్ననీ, పాత్ర చిత్రణనుగురించిన నా శంశయాన్నీ మాత్రమే స్పృశించి వదిలేశేవాణ్ణి బహుశా. -


-అక్కిరాజు భట్టిప్రోలు

1 comment:

oremuna said...

kathaa raaku

yU TU raaku