Tuesday, May 15, 2007

జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!

(విన్నపం : హమ్ ఆప్కే హై కౌన్, సాజన్, కహోనా ప్యార్ హై, టైటానిక్, నువ్వు నాకు నచ్చావు ఇత్యాదులు గొప్ప సినిమాలు అని నమ్మేవాళ్ళు దయచేసి దీన్ని చదవద్దు! )
_________________________________________________

"జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!"


నూటికి నూరు పాళ్ళూ సీతారామ శాస్థ్రి నన్ను చూసే రాశాడు అంటాను... మూడు బీర్లకి ముందైనా తర్వాతైనా!


"నీకు నా బాధలు తప్పా ప్రపంచం బాధలు బానే కనపడతాయి." అనే మా ఆవిడే సాక్షి మొదటి మాటకి.
అందరూ తెగ ఫీలయి పోయే వీర సెంటిమెంటు సినిమా చూస్తూ పగలబడి నవ్వి చుట్టు పక్కల అందరి తిట్లూ తింటం రెండో మాటకి సాక్ష్యం.


సిమ్లాలో హోటల్లో కూర్చుని ఇది రాస్తున్నాను. మా పెళ్ళయి పదేళ్ళయిందని ఓ పది రోజుల ఉత్తర భారత పర్యటనలో ఉన్నాం లెండి. సరే పదేళ్ళ క్రితమే జరిగిందాన్ని తలుచుకుని మురిసి (??) పోవడానికి మేం వస్తే, ఇక్కడ మాకు హిందీ సినిమాలు చూపిస్తున్నారు. డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్ కి వెడితే దాందుంప తెగ ఒక సమస్యా నాకు? మొత్తం టేబిల్ చుట్టూ నాలుగు జంటలు... పెళ్ళయి బహుశా వారం కూడా అయ్యుండదు. ఒకానొక ఊహా ప్రపంచంలో తేలియాడుతూ... అబ్బో చెప్పేందుకు మాటలు చాలవు (?)! మా ఖర్మానికి ఈ హోటల్ పేరు హనీమూన్ ఇన్! రోకట్లో తల పెట్టి ఇప్పుడు వగచి ప్రయోజనం ఏముంది! చుట్టూతా ఒకటే సీన్లు ??!!?


నువ్వు నాకు ఫొటో తియ్యి... నేను నీకు తీస్తా!
నువ్వలా నాజూకుగా అయిస్క్రీం నోట్లో పెట్టుకో... నేను నీకు వీడియో తీస్తా!
నీకెందుకు కష్టం... నేను తెచ్చిస్తాగా... !
ఇలా తల పెట్టు... ఈ గులాబీ నీ తల్లో పెడతా!


ఇక మా సంగతి! మా అమ్మాయి (7 సంవత్సరాలు) అది ఏ నక్షత్రంలో పుట్టిందో తెలీదు గానీ అది నా తెలివి తేటల్ని పరీక్షించని క్షణం లేదు గత ఏడేళ్ళలో! మా అమ్మాయికి ఉన్న చెడ్డ లక్షణం నిజాలు మాట్లాడటం మాట్లాడి తీరటం! అది పొర బాటున ఏ నిజం మాట్లాడుతుందో నని తెగ భయపడి పోవటం నా వంతు. "ఏం ఆ అంకుల్ ఎందుకు ఆంటీకి అయిస్క్రీం తిని పిస్తున్నాడు.... పాపం ఆంటీ చేతికి దెబ్బ తగిలిందా" అని గట్టిగా అడిగితే ఏం చెయ్యడం?


దానికి తగ్గట్టు.. ముఖ్యమంత్రి చుట్టూ అయ్యేయెస్సులు పరిగెట్టినట్టినట్టు... నేనూ మా ఆవిడా మా అమ్మాయి చుట్టూ పరిగెట్టినా... ఏదో తేడా జరగనే జరుగుతుంది దానికి. ఇక దాన్ని సముదాయించ డానికి ఓ పెద్ద హైడ్రామా తప్పదు.


మా ఆవిడ "మనం తప్పు ప్లేసుకి వచ్చామేమో" అంటుంది పైగా చుట్టూ చూసి... కడుపు మండేట్టు. అప్పుడే అంత ముసలాళ్ళ మయిపోయామా అంటాను కసిగా... మా అమ్మాయి పడేసుకున్న ఫోర్క్ కి రెప్లేస్ మెంట్ తేవడానికి పరిగెడుతూ... అది అంతర్జాతీయ సమస్య కాకముందే!


"సరే అక్కడికేదో నిజంగా వయసులో ఉన్నప్పుడేదో సాధించినట్టు" అంటుంది మా ఆవిడ.


"వాడ్డూయూమీన్ " అంటాను మేక పోతు గాంభీర్యంతో .. ఏం వినాల్సొస్తుందోనని భయంతో!


"ఏ నాడూ ఇలా నన్ను వీడియో తీసిన గుర్తు గానీ, నా తల్లో గులాబీ గుచ్చిన గుర్తుగానీ లేదు" అంటుంది


"అలా నా చొక్కా మీద పడ్డ కెచప్ ని నీ చున్నీ తో తుడిచిన గుర్తు నాకూ లేదు" అంటాన్నేను.. నేనేమన్నా తక్కువ తిన్నానా!


ఇక ఇది గాలివాన గా మారేలోపు మా అమ్మాయి... సడెన్ గా "నేను బాత్రూం కెళ్ళాలీ" అంటుంది చుట్టూ అందరికీ విన పడేలా. సీదా డైనింగ్ టేబిల్ నించి మాఆవిడ దాన్ని ఒక్క గుంజు గుంజి "పద మరి" అని పరిగెడుతుంది దాన్ని తీసుకుని. పి.టి. ఉష, షైనీ అబ్రహాం గుర్తొస్తారు నాకు. దెబ్బకి చుట్టుపక్కల డ్రీమ్ సీక్వెన్సులన్నీ కంట్రోల్-ఆల్ట్-డెల్ అయిపోతాయి! కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం కాదు నాయన లారా వాటి పర్యవసానం డైపర్లూ, బాత్ రూముల ప్రహసనాలే అనే నగ్న సత్యాన్ని మా అమ్మాయి వాళ్ళకి చెప్పేస్తుంది.


(ఇలా డైనింగ్ రూంనించి భోజనం మధ్యలో బాత్రూముకు పరిగెట్టని అమ్మానాన్న లెవరన్నా ఉంటే చూడాలని ఉంది)


వాళ్ళు తిరిగొచ్చేలోపు అయిస్క్రీం తింటూ, క్రీగంట పక్క టేబిల్ మీద కొత్త పెళ్ళికూతుర్ని చూస్తూ ఆలోచిస్తా...


ఇంత ప్రదర్శన అవసరమా... ఇది నిజంగా నిజమేనా అని. ఏవో చిన్న సరదాలు, సరసాలు, ముద్దు ముచ్చట్లూ కూడా తప్పంటే ఎట్లా... అంటే... నేనేం చెప్పలేను! తప్పు ఒప్పుల సమస్య కాదు.... అదో స్టాండర్డ్, బెంచ్ మార్కు అయి పోవడం విసుగురావట్లేదా ఎవరికీ? ఆవేశాలని ఇలా ఫైవ్ పండిట్ గైడ్ చదివి నట్టు అందరూ తు.చ తప్పకుండా బట్టీకొట్టి పాటిస్తుంటే ఇంకెవ్వరికీ ఇబ్బందిగా లేదా?


ఇప్పుడు నాకు తెలిసి మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే, సెక్రెటరీస్ డే, డాక్టర్స్ డే ... కుక్కల డే, బొద్దింకలడే .. చాలా వచ్చేశాయ్ (ఒ.కె... చివరి రెండు నాకు ఒళ్ళు మండి చేర్చా!). వాడు ఆర్చీస్ వాడూ, హాల్ మార్క్ వాడూ చెపుతాడు... మాఆవిణ్ణి, మాఅమ్మనీ నేను ఎలా ప్రేమించాలో... ఈ దేశంలో ప్రేమకి కొలబద్ద వాడి బాటం లైన్!


ఈ నాకొడుకులకి నే చెప్పేదేంటంటే... ప్రపంచంలో ప్రతి వాడూ వాళ్ళ అమ్మని ప్రేమిస్తాడు. అమెరికా వాడయినా, ఆఫ్రికా వాడయినా, భారతీయుడయినా ఎవడూ వాళ్ళమ్మని తక్కువేమీ ప్రేమించడు! మా అమ్మ బర్త్ డే ఎప్పుడో నాకు ఎప్పుడూ తెలీదు... గుర్తులేదు? అయితే ఏంటిట? ఓ సారి మా అమ్మ దక్కర కెళ్ళి నా గురించి ఏమన్నా చెడుగా అని చూడండి... జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాను!


చిన్న తనంలో (ఇంటర్మీడియట్ ప్రాంతంలో) ఓ సారి టి.వి లో ఓ ఇంటర్వూ వచ్చింది. ఒకానొక ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద వంట వాడు (చెఫ్) ఏదో పేద్ద పేరు తెచ్చుకున్నాడు... సరిగ్గా గుర్తులేదు వాడికేదో ఎవార్డు వచ్చినట్టుంది. వాణ్ణి బోలేడు ప్రశ్నలు వేశారు. అంతా బాగుంది.. చివర్లో వచ్చింది అసలయిన ప్రశ్న! మీరు ఇంత పేరు తెచ్చుకున్నారు కదా... ఇప్పుడు మీకు మీరు చేసిన వంట నచ్చుతుందా... లేక మీ అమ్మ చేసిన వంట నచ్చుతుందా అని! వాడు తడువుకోకుండా "మా అమ్మ వంటే.. అందులో మా అమ్మ ప్రేమ కూరి ఉంటుంది కదా?" అన్నాడు..


నేను కుర్చీలో తెగ ఇబ్బందిగా కదలటం ఎవరూ గమనించలా. కాపోతే... నాచుట్టూ ఉన్న వాళ్ళు తెగ ఆనంద పడి పోయి కళ్ళు తుడుచుకోవటం నాకు ఇప్పటికీ ఒళ్ళు మండించే వ్యవహారం.


ఒక్కటి చెప్పండి! ఏవిటా ప్రశ్న.... ఈ భూప్రపంచంలో ఎవడన్నా టి.వి. కెమెరా ముందు కూర్చుని ఆ ప్రశ్నకి వేరే ఏదన్నా సమాధానం చెప్తారా? మరా ప్రశ్న అడగట మెందుకు... అది విని అంత తెగ ముచ్చట పడి పోవట మెందుకు?


అమెరికన్ వీసాకి అప్లై చేసిన వాళ్ళకి తెలుసు ఇలాంటి ప్రశ్నలు.
"నువ్వెప్పుడన్నా డ్రగ్స్ అమ్ముతూ కానీ, వాడుతూ కానీ పట్టుబడ్డావా?"
"నువ్వు అమెరికా వెళ్ళి అక్క డే ఉండి పోయే ఉద్దేశం ఉందా?"
"నీకు ఊరంతా అంటించే భయంకరమైన అంటురోగం ఉందా?"


ఈ ప్రశ్నలకి "అవును" అని సమాధానం చెప్పే వాడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండి ఉంటాడా? అలాంటిదే ఆ పై ప్రశ్న కూడా! ఎప్పుడన్నా అవకాశం రావాలి గానీ కావాలని ఇలాటి వాటికి తిక్కగా సమాధానం చెప్పాలని నాకు మా చెడ్డ కోరిక

"మా అమ్మ వంటా... పరమ చెత్త. సరయిన భోజనం చెయ్యాలంటే నాదక్కరకే రండి" అని చెప్పి చోద్యం చూడాలన్న మాట.... "నువ్వు కావాలనుకునే సమాధానం నేను చెప్పనూ ... ఎక్కడ దూకుతావో దూకు" అని మనం ప్రత్యేకంగా అనఖ్ఖర్లా... వాడికి అర్థమయిపోతుంది!


నా ఆలోచనల్లోంచి బయట పడేలోపు మా అమ్మాయి, ఆవిడా తిరిగి వస్తారు.


నేను రాజీ పడే ప్రయత్నంలో... "సరే... రేపు మారేజ్ డేకి ఫ్రెంచ్ షాంపేన్ కొంటాను చూడు మనాలి వెళ్ళేలోపు" అంటాను


మా ఆవిడ మొహం చిట్లించి "నీకు షాంపేన్ తాగాలంటే తాగు.. ఈ డొంక తిరుగుళ్ళెందుకు. నువ్వంత నిజంగా ఫీలయి పోతే మనాలి లో మంచంతా కరిగి పోతుంది. అనవసరంగా ప్రయత్నించకు" అంటుంది.


విచిత్రంగా నాకు... కోపంరాదు... పదేళ్ళలో ఎంత అర్థంచేసేసు కుంది మా ఆవిడ నన్ను అని తెగ ఫీలయ్యి పోతా! ఇంకే షాంపేన్ బాటిలూ అక్కర్లా!


(ఓ పరమ కర్కోటకపు మొరటు తనాన్నించి... పదేళ్ళలో నన్ను ఎంతో కొంత సంస్కరించిన పరమ దుర్మార్గురాలు... మా ఆవిడకి!)

9 comments:

కొత్త పాళీ said...

yes, AviDalU zindabaad!
double yes, let's drink a fourth beer to the AviDalu of the world!!
Amen.

కొత్త పాళీ said...

అసలు విషయం మర్చిపోయాను. పదో మజిలీ దాటినందుకు మీకూ శ్రీమతికీ, చిన్నారికీ అందరికీ శుభాభినందనలు.

Anonymous said...

చాలా బాగుంది. నాకు ముందు భవిష్యత్తు కనిపిస్తుంది.... :)

రానారె said...

"అందరూ చూస్తున్నారు, మంచి తరుణం, నా జడలో గులాబిపువ్వు తురమరేఁ ఈ మోటు మనిషి!?" టైపు పెళ్లాం వస్తే ఏమిటి గతి!? తలచుకొంటేనే జలదరింపుగా ఉంది.

Anonymous said...

అయ్యో అప్పుడే అయిపోయిందా..

డైనింగ్ టేబుల్ నుంచి పిల్లల కోసం బాత్ రూం కి పరిగెత్తాల్సి రావటం గురించి మీరు చెప్తే భలే నవ్వొచ్చింది.

పిల్లలు చాలా సార్లు వూహా లోకం నుండి వాస్తావానికి తీసుకువచ్చి మనల్ని చాలా ఎడ్యుకేట్ చేసేస్తారు.

రాధిక said...

మొదట చదివి ఇదీ కధేమొ అనుకున్నాను.కామెంట్లు చూసి తెలుసుకున్నాను.10 వసంతాలు పూర్తి చేసుకున్న మీకు శుభాభినందనలు.పిల్లలతో పడే పాట్లు అన్ని ఇన్ని కాదులెండి.షాపింగ్లకి వెళ్ళినప్పుడు అక్కడి అర్ధనగ్న బొమ్మలు చూసి మా వాడు షేం షేం అనేవాడు.ఇప్పుడు అయితె డైరక్ట్ గా పొట్టి దుస్తులేసుకున్న అమ్మాయిలని చూసి అనేస్తున్నాడు.అది విన్న వాళ్ళ పరిస్తితేమిటో నాకు తెలీదు గానీ మా పరిస్తితి మత్రం మహా దారుణం గా వుంటుంది.మొదట్లో డైనింగ్ రూం నుండి మధ్యలో లేచి బాత్ రూం కి వెళ్ళాలంటే చాలా సిగ్గుగా వుండేది.ఇప్పుడు మావాడు ఎప్పుడన్నా అలా లేవకపోతే ఏదో వెలితిగా వుంటుంది.[:)].స్వాతి గారూ మీకు త్వరలో ఆ అనుభవం కలుగుతుంది లెండి.ఎక్కువ నవ్వు కోవద్దు.

Unknown said...

ఏదో పాపం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని వదిలేయక ఇలా వాళ్ళ గురించి రాస్తారా ? ఆయ్...

Anonymous said...

happy marriage aniversary...
chala baaga raasaru
venkat
www.24fps.co.in

joy said...

chaala nizaalu chakkaga raasaru.baaundi.