Wednesday, May 2, 2007

రిసైకిల్ : అస్థిత్వానికి అటూ ఇటూ గురించి

చాలా కాలం క్రితం నించీ నేను అంతర్జాలం లో అవీ ఇవీ రాస్తున్నాను. కథలు రాయటం కొత్త వ్యసనమయితే, ఇంటర్నెట్ లో జనాల్ని విసిగించడం దాదాపు పది పన్నెండేళ్ళనించీ నిరవధికంగా సాగుతూనే ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని బానే రాశాననీ అనిపిస్తుంది... కొన్ని నాకే నా అప్పటి అమాయకత్వం మీద జాలి కలుగుతుంది. ఒకటి మాత్రం నిజం... కథలు రాయటానికి ముందు నేను మరింత ఎక్కవగా నోరు (పోనీ కీ బోర్డు) పారేసుకునేవాణ్ణి. అలాటి అప్పటి రాతల్లోంచి నాకు దాచుకోవాలనిపించిన వాటిని మెల్లిగా నా బ్లాగు లోకి చేరుద్దామనుకుంటున్నాను.

నేను ఈ మధ్య రాసిని "కొత్త కథకుల కష్టాలు" అన్న వ్యాసం రాశాక నేను ఏకథనీ ఉదహరించకుండా పైపైన రాశానని కొందరన్నారు. పూర్వాశ్రమంలో ఒకటి రెండు కథల మీద నా అనాలిసిస్ రాశాను. వాటిని మళ్ళీ ఇక్కడ వేద్దామనుకుంటున్నాను.
________________________________________
కథ : అస్తిత్వానికి అటూ ఇటూ (తానా బహుమతి పొందిన కథ)
రచయిత : మధురాంతకం నరేంద్ర
కథ ప్రచురణ కాలం : జులై 2001
నా అనాలిసిస్ రాసిన కాలం : అగస్టు 2002
నా ఒరిజినల్ పోస్టు దాని అనుబంధ చర్చ ఇక్కడ.


ఇక నా పైత్యం :
అస్థిత్వానికి అటూ ఇటూ చదివినప్పుడు ఓ అభిప్రాయం ఏర్పరచుకుని, రచయిత చెప్పదల్చుకున్నది ఇదీ అని ఓ నిర్ణయానికి వచ్చాను. కానీ అలా అనుకుని వెనుతిరిగే లోపులో ఈ కథమీద రివ్యూలు రావటం మొదలు పెట్టాయి. కానీ ఏ రివ్యూలోనూ నేనకున్నట్టుగా ఈ కథని ప్రస్తావించకపోవడం నాకాశ్చర్యం వేసింది. అందుకని ఈ కథని నేనెలా అర్థం చేసుకున్నానో అందరికీ చెప్పే ప్రయత్నం ఇది.

ముందుగా ఓ ప్రశ్న. మనిషి మారడం అంటే ఏమిటి

సినిమా ఫక్కీలో విలన్ గారు ఆఖరిసీన్లో "నన్ను క్షమించమ్మా.... నేను మారాను" అని హీరోయిన్ కూతురుతో చెప్పి చేతికి బేడీలతో జీప్ ఎక్కి జైలు కెళ్ళిపోవడం లాంటి జోకులు కాదు నేను మాట్లాడుతున్నది!

తాను మనసా, వాచా నమ్మిన ఓ ఆలోచనని, సిద్ధాంతాన్ని, పంథాని... తన ఆలోచనలతోటి, "హేతువు" తోటి నిర్మించుకున్న తనదైన వ్యక్తిత్వానికి ఎదురువాదం ఒకటి వచ్చినప్పుడు, దానికి ఎదురు నిలిచే, ఎదురొడ్డే సమాధానం తన దగ్గర లేనప్పుడు, ఆ మనిషిలో సంచలనం కలగొచ్చు. దానికి ప్రతిగా వ్యక్తి తన "వ్యక్తిత్వాన్ని" తన "నమ్మకాన్ని" మార్చుకోవాల్సి రావచ్చు, మార్చు కోవచ్చు... నిజంగా ఆ మెచ్యూరిటీ, హుందాతనం ఆ మనిషిలో ఉంటే. ఎంతో మంది తత్వవేత్తలు కూడా ఇలా ముందుకూ వెనక్కీ లాగి పీకి తాము చెప్పినవాటికి తామే కాలక్రమంలో మార్పులూ చేర్పులూ చేశారని విని వున్నాం. ఇదీ మనిషి మారటం అంటే!

మరో రకం ఉంది. దీన్ని కూడా "మారటం" అనే అంటారేమో? అనొచ్చేమో? అలా అనొచ్చంటే, బహుశా నేనిది రాయక్కర్లేదనుకుంటాను!

చిన్నప్పుడు అమ్మ నేర్పించిందని నిద్దర్లేవంగానే ఎడంచేత్తో బ్రష్షు పట్టుకుని కుడి చేత్తో దాని మీద పేస్టు వేసుకుంటాం! ఓ ఎడమ చేతి వాటం గాడికి ఎప్పుడో పొరపాటున రివర్స్ చేసి చూసిందాకా... తానింతకాలం చేసింది తనకు నచ్చిన, సులువైన పని కాదనీ, అందుకు విరుద్ధమైన పనే నిజానికి తనకి తగిన పనీ అని గ్రహించ లేక పోవచ్చు! అది గ్రహించడం ఆ మనిషిలో మార్పు అని నేననలేను.

అదేరకంగా దేవుణ్ణో, మరో సిద్ధాంతాన్నో నమ్మటం, నమ్మక పోవటం కూడా. ఎవరో ఒకాయన అన్నాడు, ప్రపంచంలో 90% మంది భక్తుల 90% భక్తి, 90% మంది నాస్థికుల 90% నాస్థికత్వం రెండూ అబద్ధమే అని. అంకెల్లోకీ, ఈ విషయంలో నిజా నిజాల్లోకీ వెళ్ళద్దు గానీ, ఇందులో ఓ ముఖ్యమైన ప్రశ్న ఉంది.

ఎంతమంది ఆస్థికులు దేవుణ్ణి నమ్మటానికి, క్రతువులూ గట్రా చెయ్యడానికి తమకంటూ ఓ రీజనింగ్ ని ఏర్పరచుకుని వున్నారు? అలాగే, అలాంటి ప్రశ్నే నాస్థికులని కూడ అడగొచ్చు. చిన్నప్పట్నించీ చుట్టూతా వున్న పెంపకం వాతావరణం ప్రకారం అలా గుడ్డిగా చేసుకు పోవటమే తప్పా, సొంతంగా కూర్చుని ఆలోచించుకునే తత్వం ఎందరికి ఉంటుంది? ఎన్ని విషయాల్లో ఉంటుంది? తరచి చూసుకుంటే అందరిలోనూ ఇలా తెలియకుండా జీవితంలో రొటీన్ అయిపోయినవి, ఆలోచించకుండా ఆచరించుకుంటూ వస్తున్నవి ఉంటాయి అని నా భావన. అది చిన్న విషయాలనించి పెద్ద విషయాల దాకా! మనం నమ్ముతున్నామనుకుంటున్న కొన్ని నమ్మకాలతో సహా! "మడి కట్టుకో", "బొట్టు అడ్డంగా పెట్టుకో", "క్రాసు మెళ్ళో వేసుకో", "ముక్కు మీద చెయ్యి పెట్టుకో", "పిడికిలి బిగించు", "ముక్కు మీద చెయ్యి తియ్యకుండానే మమ అనుకో", "బిగించిన పిడికిలి గాల్లో ఊపి లాల్ సలాం అని అరువు"... ఇలాంటి వన్నీ కూడా.

మనిషి తనని తాను తన మేధస్సు తోటీ, హేతువు తోటీ తరచి చూసు కోకుండా చుట్టూతా వున్న వాతావరణాన్ని యథాతథంగా అనుసరించడం వల్లా, అలా అనుసరించేటట్టు అతగాణ్ణి తయారు చేయడం వల్లా వచ్చే స్థితి ఇది.

ఆ మనిషి ఆ వాతావరణం నించి బయట పడ్డమో, లేదా తనకి తాను సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి ఎదురయినప్పుడో అకస్మాత్తుగా తనకి తెలిసి వస్తుంది. తానింత కాలం ఆచరించిందీ, నమ్మిందీ తన ప్రవృత్తే కాదని. ఇలా జరగటం మనిషి మారడం కాదు, తనని తాను తెలుసు కోవడం!

నరేంద్ర గారి కథలో నా కదే కనపడింది. ఒకే ఒక్క సంఘటన, అదెంత బలమయినదయినా సరే ఓ ఆస్థికుడు నాస్థికుడు గానూ, ఓ నాస్థికుడు ఆస్థికుడు గానూ మారతాడంటే నేన్నమ్మను.... ఇందాకటి సినిమా విలన్ మళ్ళీ గుర్తొస్తాడు!

నేనీ కథని రెండు పాత్రల (సంజీవి, జానీ) కోసం విడి విడి గా చదివాను, ఒక్కళ్ళమీదే ఫోకస్ చేస్తూ. సంజీవి ఎక్కడా తాను వైదిక కర్మల్ని లోతుగా నమ్మేస్తున్నట్టుగాను, అందుకు తనకంటూ ఉన్న కారణాలను గానీ వివరించలేదు. అది అతగాడు కావాలని ఏర్పరచుకున్న వ్యక్తిత్వం కాదు. వాళ్ళమ్మ తనని నిష్టగా పెంచిందిట, ఇతగాడు భక్తితో, నిష్టతో అన్నీ నిర్వర్తించాడుట... అందుకని ఏ అపకారం జరక్కూడదుట! నిజంగా స్వతహాగా అంత భక్తి ఉన్న వాడయ్యుంటే ఏదో అపచారం జరిగుంటుందని మళ్ళీ శాస్త్రి గారిని చూడ్డానికి వెళ్ళుండే వాడు. అంతేగానీ అకస్మాత్తుగా నాస్థికుడయిపోడు.

కథంతా జాగ్రత్తగా చూడండి. ఆచారాలకీ, వ్యవహారాలకీ జరిగిన "ఎమెండ్మెంట్ల" గురించిన మాటొచ్చినా, ఆ పేరుతో జరుగుతున్న వ్యాపారాల గురించిన సంభాషణ అయినా దీని గురించిన బాధ, ఆసక్తీ జానీ లోనే ఎక్కువ కనపడతాయి. వీటి పట్ల ఓ అవగాహనా ఓ ఇతమిథమయినా ఆలోచన ఏర్పరచు కున్నవాడే అయితే సంజీవి ఆ సంభాషణల్ని అలా తుంచేయడం గానీ, ఆసక్తి చూపించకుండా ఉండడం గానీ చెయ్యడు. జానీ నిజంగా అంతటి నాస్థికుడే అయితే ఆ జరిగే వ్యవాహారాల్లో అంతకగా బాధపడి పోవాల్సిన పనిలేదు. సంజీవి ఏదో రకంగా పని చేసుకుపోదాం అని చూస్తుంటే, జానీ ఏమో ప్రతి దాన్నీ తరచి చూస్తున్నాడు.. ఎందుకని?

అంచేత, సంజీవి, జానీలలో వచ్చింది మార్పు కాదు. వాళ్ళు నమ్ముతున్నామనుకున్న నమ్మకాలనించి వాళ్ళకి విముక్తి దొరికింది. అసలు ఇదీ నేను నమ్ముతున్నది, ఇన్నాళ్ళూ ఎలా తెలుసుకోలేక పోయాను అనుకున్నది అంతే!

బాల్యంలో ఆలోచించడం, ప్రశ్నించడం నేర్చుకుంటున్న సమయంలో స్వంతంగా వ్యక్తిత్వాన్నీ ఏర్పరచుకునే అవకాశం లేకుండా , నెత్తిమీద భక్తి, ఆచారం, సిద్ధాంతం అంటూ ప్రశ్నించే అవకాశం కూడ ఇవ్వకుండా రుద్దేస్తే తయారయే అర కొర వ్యక్తులకీ, వ్యక్తిత్వాలకీ ప్రతీకలు ఈ పాత్రలు రెండూ, జానీ, సంజీవిలు.

- అక్కిరాజు భట్టిప్రోలు

1 comment:

Nagaraju Pappu said...

బావుంది గురూ. కీలకం పట్టేవు - మూడు పెగ్గులుకొడితే సత్యదర్శనం అవ్వక చస్తుందా మరి?

belief is not a substitute for knowledge. Knowledge opens up a course of action. Action leads to understanding. Understanding is permenant change in behavior.

కాబట్టి, మరోసారి ఆలోచించు..
మిత్రుడు,
నాగరాజు.